బంగ్లాదేశ్ బిచ్చగాడికి 21 మంది భార్యలు?.. ఈ కధనం వెనుక అసలు నిజాలు…

తాజాగా ప్రముఖ మీడియా సంస్థల నుంచి సోషల్ మీడియా వరకు.. ఒక వార్త విపరీతంగా హైలెట్ అవుతోంది. బంగ్లాదేశ్ కు చెందిన బిచ్చగాడికి 21 మంది భార్యలు ఉన్నట్లు.. అతగాడు తన 21 మంది భార్యల పేర్లలో ఎనిమిది మంది పేర్లు మాత్రమే చెప్పటం.. మిగిలిన వారి పేర్లు గుర్తు లేదని చెప్పినట్లుగా కథనం పబ్లిష్ అయ్యింది. అంతేకాదు.. తన దగ్గర ప్రత్యేకత ఏమిటో తనకు తెలీదని.. తన వద్దకు వచ్చి పెళ్లి చేసుకుంటామని కోరుకున్నందున.. వారిని నొప్పించటం ఇష్టం లేక తాను వాళ్లను పెళ్లి చేసుకున్నట్లుగా సదరు కథనాలు చెబుతున్నాయి. 
ఒకప్పుడు భారతదేశంలో భాగం.. ఆ తర్వాత పాకిస్తాన్ లో భాగమై.. తదనంతర దశల్లో ఒక దేశంగా మారిన బంగ్లాదేశ్ లో పరిస్థితి అందుకు భిన్నంగా ఉండే అవకాశం అస్సలు ఉండదు. అందునా.. ఒక పూరి గుడిసెలో నివసించే 35 ఏళ్ల మోరు మియా తన 21 మంది భార్యల కథ వినేందుకు విడ్డూరంగా ఉండటం.. దానికి ప్రముఖ మీడియా సంస్థలు సైతం కథనాలు పబ్లిష్ చేయటం చూసినప్పుడు.. ఎక్కడో.. ఏదో తేడా కొట్టినట్లుగా అనిపించటం ఖాయం. అందుకే వార్తల్లో వ్యక్తిగా మారిన ఒక బిచ్చగాడి విషయాన్ని మరింత లోతుల్లోకి వెళ్లే ప్రయత్నం చేసినప్పుడు షాకింగ్ అంశాలు ఎదురయ్యాయి. బంగ్లాదేశ్ మీడియాలోనే కాదు..  అంతర్జాతీయంగా పలు దేశాలు ఇతగాడి కథనాన్ని ఆఫ్ బీట్ స్టోరీగా పబ్లిష్ చేసిన తీరు చూస్తే.. ‘‘ఎద్దు ఈనిందని ఒకడంటే, దూడను గాట కట్టెయ్యమని మరోడన్నాడంట’’ అన్న సామెత చందంగా దీన్ని చెప్పొచ్చు. ఈ వార్తా కథనం.. దాని వెనుకున్న వాస్తవాల్ని తెలుసుకోవటం ద్వారా.. వార్తల్ని వండి వార్చే విధానం ఇటీవల కాలంలో ఎంత పెరిగిందన్న విషయం అర్థం కావటమే కాదు.. వార్తల్ని చూసే కోణాల్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ వార్త గురించి మరింత లోతుల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. 

 

మీడియాను డామినేట్ చేసేసిన సోషల్ మీడియా యుగంలో.. మనిషిని తప్పుదారి పట్టించేలా సమాచారం ఈ రోజు సరదా అంశానికి పరిమితమై ఉండొచ్చు. కానీ.. రేపొద్దున ఇది మనిషి జీవితాన్ని ప్రభావితం చేసేలా మారితే.. ఎంత ముప్పు? అన్నది అసలు ప్రశ్న. ఇక వార్త లోతుల్లోకి వెళితే.. తొలుత ఈ వార్తను టెలికాస్ట్ చేసింది మాత్రం బంగ్లాదేశ్ కు చెందిన ‘కాల్ బేలా’ అనే మీడియా సంస్థ ఈ వార్తను తొలిసారి ప్రసారం చేసింది. కాల్ బేలా అల్లాటప్పా మీడియా సంస్థ కాదు. బంగ్లాదేశ్ లో పేరున్న దినపత్రికతో పాటు.. దీని వెబ్ సైట్ కు విపరీతమైన ఆదరణ ఉంది. మరో షాకింగ్ అంశం ఏమంటే.. బంగ్లాదేశ్ కు చెందిన ప్రముఖ ఫ్యాక్ట్ చెక్ సంస్థ ‘రుమర్ స్కానర్’ విడుదల చేసిన రిపోర్టులో బంగ్లాదేశ్ మీడియాలో తప్పుదారి పట్టించే కథనాలు ఎక్కువగా పబ్లిష్ చేసే సంస్థల జాబితాలో ‘కాల్ బేలా’ కూడా ఉన్నట్లు పేర్కొనటం గమనార్హం. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. తాము పబ్లిష్ చేసే వార్తలు ఎక్కువగా ప్రజలకు చేరువ అయ్యే వీలున్న మీడియాసంస్థలు సైతం వెనుకా ముందు చూసుకోకుండా కథనాల్ని పబ్లిష్ చేయటం పెద్ద పొరపాటు.
21 మంది భార్యలున్న బిచ్చగాడి వార్త విషయానికి వస్తే.. అతను చెప్పినట్లుగా పేర్కొన్నప్పటికి.. దారిన పోయే దానయ్య నాలుగు మాటలు చెబితే.. ఆ మాటలు రోటీన్ కు భిన్నంగా.. అందరిని ఆశ్చర్యపరిచేలా ఉంటే.. సరైన క్రాస్ చెక్ చేయకుండా వార్తల్ని పబ్లిష్ చేస్తారా? అన్నది ప్రశ్న. అదిగో తోక అంటే ఇదిగో పులి అన్న చందంగా బంగ్లాదేశ్ పేరున్న మీడియా సంస్థలో పబ్లిష్ అయిన వైరల్ వార్తను మన దేశానికి చెందిన కొన్ని ప్రముఖ మీడియాసంస్థలు కాసింత మసాలా జోడించి.. ఏఐ ఫోటోలతో వార్తను పబ్లిష్ చేసి మరింత వైరల్ కంటెంట్ గా మార్చేయటం కనిపిస్తుంది
ఇది ఇలా ఉంటే నిజానికి ఈ 21 మంది భార్యలున్న బిచ్చగాడి వార్తను ప్రచురించిన బంగ్లాదేశ్ మీడియా సంస్థ అంతో ఇంతో బెటర్. అతను చెప్పాడు.. అతను చెప్పిన ప్రకారమని పేర్కొంటే.. మన మీడియాసంస్థలు కనీసం క్రాస్ చెక్ చేసుకోకుండా అదే విషయాన్ని వార్తల రూపంలో చెప్పేసి.. మరిన్ని క్లిక్కుల్ని సొంతం చేసుకోవటానికి ప్రయత్నం చేయటం కనిపిస్తుంది. ఇంతకూ ఈ కథనంలోని అసలు వాస్తవాల్లోకి వెళితే..ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత బంగ్లాదేశ్ కు చెందిన కొన్ని ప్రాంతీయ మీడియా చానళ్లు మోరు మియాను కలిసి.. అతడి ఇంటిని చూడగా..అతనితో ముగ్గురు మహిళలు ఉన్నట్లుగా గుర్తించారు. ఆ ముగ్గురు భార్యలతో మాట్లాడారు. అయితే.. వారు చెప్పిన విషయాల్లో నిజాల్ని తూకం వేయకుండా.. మసాలా ఆఫ్ బీట్ స్టోరీ దొరికిందన్న ఆత్రంతో వార్త వేసేస్తే.. అదిప్పుడు పలు దేశాల్లోనూ వైరల్ వార్తగా మారింది. 
బంగ్లాదేశ్ చట్టాల ప్రకారం 21 మందిని పెళ్లి చేసుకోవటానికి వీలుందా?అన్నది చూస్తే.. బంగ్లాదేశ్ ముస్లిం ఫ్యామిలీ లాస్ ఆర్డినెన్స్ ప్రకారం గరిష్ఠ పరిమితి నలుగురిని మాత్రమే పెళ్లి చేసుకునే వీలుంది. ఒక పురుషుడు ఒకే సమయంలో గరిష్ఠంగా నలుగురు భార్యల్ని కలిగి ఉండొచ్చు. 
.ఒక వ్యక్తి రెండు లేదంటే అంతకు మించి పెళ్లిళ్లు చేసుకోవాలంటే బంగ్లాదేశ్ ప్రభుత్వ అధికారిక ఆర్బిట్రేషన్ కౌన్సిల్ నుంచి రాతపూర్వక అనుమతి పొందాలి. తన పెళ్లిళ్లకు సంబంధించిన సరైన కారణాలు చూపించాలసి ఉంటుంది. కౌన్సిల్ అనుమతి లేకుండా పెళ్లిళ్లు చేసుకుంటే చట్ట ప్రకారం చెల్లకపోవటమే కాదు.. సదరు వ్యక్తికి ఏడాది జైలు.. లేదంటే జరిమానా మాత్రమే రెండు కలిపి శిక్ష విధించే వీలుంది. ఈ బిచ్చగాడు ముస్లిం కావటంతో అతడికి ఈ చట్టం పరిధిలోకి వస్తాడు.
 కాగా మోరు మియా 21 మందిని పెళ్లి చేసుకున్నది నిజం కాదని పలువురు తేల్చారు. అతను ఉన్న గ్రామానికి వెళ్లి విచారిస్తే అతను కేవలం ముగ్గురు భార్యల్ని మాత్రమేనని తేలింది. మీడియాను ఆకర్షించేందుకు అతను 21 మంది భార్యల స్టోరీని క్రియేట్ చేసినట్లుగా అనుమానాలు ఉన్నాయి. మీడియా ఇంటర్వ్యూలలోనూ కేవలం 8 మంది పేర్లు మాత్రమే చెప్పటాన్ని మర్చిపోకూడదు. గతంలో అతను కొందరిని పెళ్లి చేసుకొని.. విడిపోయి ఉండేందుకుఅవకాశం ఉంది. అంతే తప్పించి.. మీడియా కథనాల్లో మాదిరి అతను 21 మంది భార్యలతో కలిసి ఉన్నాడన్న దానిలో ఇసుమంతైనా నిజం లేదని స్పష్టమవుతోంది. 
కొన్ని మీడియా సంస్థలు మాత్రం తమ కథనాల్లో ఈ బిచ్చగాడి వాదన ప్రకారం అని పేర్కొంటూ.. తాము సర్టిఫై చేయటంలేదు కాగా .. అతను అలా చెప్పాడు కాబట్టి అతని మాటల్ని తాము చెప్పినట్లుగా చెప్పటం ద్వారా బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే .. విలువ పరంగా చూస్తే.. వైరల్ వార్తలను పాఠకులకు అందించే కన్నా.. క్రియేట్ చేసే ధోరణి మాత్రం ప్రమాదకరంగా మారుతొందని చెప్పక తప్పదు.

 

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు