ప్రేమకథల స్పెషలిస్ట్ ‘తొలిప్రేమ’ కరుణాకరన్ రీఎంట్రీ..
పవన్ కల్యాణ్‌తో ‘తొలిప్రేమ’ వంటి క్లాసిక్ సహా ‘డార్లింగ్’, ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ వంటి ఫీల్ గుడ్ చిత్రాలను అందించిన దర్శకుడు ఎ. కరుణాకరన్ చాలా కాలం తర్వాత మెగా ఫోన్ పట్టారు. యువ నటుడు బెల్లంకొండ గణేష్ హీరోగా తన మార్క్ యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ కథతో ఆయన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. గోల్డెన్ టర్టిల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మౌనిక రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం సోమవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.
అనుదీప్ కేవీ కామెడీ.. భీమ్స్ మ్యూజిక్ హైలైట్..
ఈ చిత్రానికి ముగ్గురు టాలెంటెడ్ టెక్నీషియన్లు తోడవ్వడం విశేషం. కరుణాకరన్ కథకు, ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ కేవీ తనదైన శైలిలో హాస్య సంభాషణలు (డైలాగ్స్) అందిస్తున్నారు. వీరికి తోడుగా ప్రస్తుతం వరుస హిట్లతో దూసుకుపోతున్న మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. కరుణాకరన్ మార్క్ రొమాన్స్, అనుదీప్ మార్క్ హ్యూమర్, భీమ్స్ మాస్ అండ్ క్లాస్ మెలోడీలు కలగలిసి ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలను పెంచుతున్నాయి.
ఘనంగా ప్రారంభమైన పూజా కార్యక్రమాలు..
చిత్ర ప్రారంభోత్సవానికి ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ ముఖ్య అతిథిగా విచ్చేసి ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టారు. అనుదీప్ కేవీ కెమెరా స్విచాన్ చేయగా, చిత్ర యూనిట్‌కు స్క్రిప్ట్‌ను అందజేశారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని, హీరోయిన్ మరియు ఇతర నటీనటుల వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటిస్తామని చిత్ర బృందం వెల్లడించింది. వరుస విజయాలతో జోరు మీదున్న సాంకేతిక నిపుణులు ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడంతో బెల్లంకొండ గణేష్ కెరీర్‌లో ఇది కీలక చిత్రంగా మారనుంది.









