చంద్రబాబు 76వ పుట్టినరోజు వేడుకలు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సోమవారం తన 76వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాజకీయ, సినీ ప్రముఖుల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలో హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు పాత్రను గుర్తుచేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
విజన్ ఉన్న నేతగా ప్రశంసలు..
1990లలోనే చంద్రబాబు అత్యంత స్పష్టమైన విజన్‌తో పనిచేశారని ధర్మపురి అరవింద్ కొనియాడారు. “ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్ సీట్లను ప్రణాళికాబద్ధంగా విస్తరించడం ద్వారా తెలుగు యువత ప్రపంచ ఐటీ రంగానికి పరిచయం కావడానికి చంద్రబాబే పునాది వేశారు” అని ప్రశంసించారు. అప్పట్లో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే నేడు తెలుగు వారు ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్‌వేర్ రంగంలో రాణించడానికి కారణమయ్యాయని అభిప్రాయపడ్డారు.
హైటెక్ సిటీ – గ్లోబల్ ఐటీ హబ్..
హైదరాబాద్‌ను గ్లోబల్ ఐటీ హబ్‌గా తీర్చిదిద్దిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని అరవింద్ పేర్కొన్నారు. హైటెక్ సిటీ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించి, లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారని కితాబు ఇచ్చారు. చంద్రబాబు నాయకత్వ పటిమ మరియు దార్శనికత వల్లే హైదరాబాద్ నేడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని, ఆయన ముందుచూపు అభినందనీయమని తన పోస్టులో ఎంపీ అరవింద్ వివరించారు.








