కల్వకుంట్ల కవిత తన కొత్త రాజకీయ పార్టీ ‘తెలంగాణ ప్రజా జాగృతి’ ఆవిర్భావానికి ముహూర్తం ఖరారు చేశారు. రేపు (ఏప్రిల్ 25వ తేదీ) ఉదయం 10 గంటలకు మేడ్చల్ పరిధిలోని మునీరాబాద్ గ్రామం అద్వయ కన్వెన్షన్‌లో పార్టీ పేరు, జెండాను ఆమె అధికారికంగా ఆవిష్కరించనున్నారు. మార్పు కోరుకునే అభ్యుదయవాదులంతా తనతో అడుగులు కలపాలని పిలుపునిచ్చిన కవిత, ఈ కార్యక్రమానికి భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు.
ఈ పార్టీ ప్రకటన ముహూర్తం వెనుక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక, జ్యోతిష్య కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. పంచాంగం ప్రకారం ఏప్రిల్ 25న వైశాఖ శుక్ల నవమి, అనగా ‘సీతా నవమి’. మాతృశక్తి, ధర్మం, సమాజ సేవకు ప్రతీకగా నిలిచే ఈ పవిత్రమైన రోజున కొత్త జనసేవా ఉద్యమాలు ప్రారంభిస్తే ఆధ్యాత్మికంగా సానుకూల శక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే ఆ రోజు శనివారం, ఆశ్లేష (సర్ప) నక్షత్రం కావడం వల్ల, మొదట్లో కొన్ని ఇబ్బందులు, సవాళ్లు ఎదురైనా అంతిమంగా దీర్ఘకాలిక సత్ఫలితాలు సాధిస్తారని అంచనా వేస్తున్నారు.
కవిత జాతకం, ప్రస్తుత గ్రహస్థితులను బట్టి విశ్లేషిస్తే.. ఆమెకు ప్రస్తుతం ఏలినాటి శని ప్రభావం నడుస్తోంది. దీనివల్ల పార్టీ ప్రారంభ దశలో వ్యతిరేకత, ఆర్థిక లేదా న్యాయపరమైన సవాళ్లు, అస్థిరత ఎదురయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే, సీతానవమి రోజున పార్టీని ప్రారంభిస్తున్నందున యువత, మహిళల నుంచి విశేష మద్దతు లభించి, ఆధ్యాత్మిక శక్తి ఆమెను బలపరుస్తుందని అంచనా. ఈ పార్టీ కేవలం రాజకీయ అజెండాతో కాకుండా ఒక ధర్మయుద్ధంగా, జన ఉద్యమంగా ముందుకు సాగితే భవిష్యత్తులో కవితకు ఎదురుండదని జ్యోతిష్య నిపుణులు విశ్లేషిస్తున్నారు.









