ఆప్‌కు భారీ షాక్: బీజేపీలో చేరిన రాఘవ్ చద్ధా సహా ఏడుగురు ఎంపీలు.. అసలేం జరిగింది?

అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అత్యంత భారీ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆ పార్టీకి ఉన్న 10 మంది రాజ్యసభ ఎంపీల్లో ఏడుగురు ఏకకాలంలో తిరుగుబాటు చేసి, బీజేపీలో విలీనమవుతున్నట్లు ప్రకటించారు. రాఘవ్ చద్ధా నేతృత్వంలో అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్, హర్భజన్ సింగ్, రాజిందర్ గుప్తా, విక్రమ్ సహాని మరియు స్వాతి మాలివాల్‌లు ఆప్‌కు రాజీనామా చేశారు. రాజ్యాంగం ప్రకారం మూడింట రెండు వంతుల బలం ఉండటంతో, వీరంతా సాంకేతికంగా బీజేపీలో విలీనం కావడానికి మార్గం సుగమమైంది.

ఈ ఆకస్మిక పరిణామానికి ముందు పార్టీని కాపాడుకునేందుకు అరవింద్‌ కేజ్రీవాల్ చివరి నిమిషం వరకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. తిరుగుబాటు ఎంపీలతో చర్చించేందుకు శుక్రవారం సాయంత్రం ఆయన తన నివాసంలో భేటీ ఏర్పాటు చేశారు. ఎంపీలకు ఏవైనా సందేహాలుంటే పదవులకు రాజీనామా చేయాలని, వచ్చే టర్మ్‌లో మళ్ళీ టికెట్లు ఇస్తామని కూడా కేజ్రీవాల్ హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే, ఈ భేటీకి ముందే ఎంపీలు ఒక బృందంగా ఏర్పడి పార్టీని వీడాలని గట్టి నిర్ణయం తీసుకోవడంతో కేజ్రీవాల్ ప్రయత్నాలు ఫలించలేదు.

రాజ్యసభలో ఆప్ డిప్యూటీ లీడర్ పదవి నుంచి రాఘవ్ చద్ధాను తొలగించి, అశోక్ మిట్టల్‌ను నియమించడం ఈ అసమ్మతికి ప్రధాన కారణమని సమాచారం. ఈ చర్య తర్వాతే ఎంపీలంతా ఏకమై పార్టీ మారాలనే ఒత్తిడి పెరిగినట్లు తెలుస్తోంది. “15 ఏళ్ల రక్తం, చెమట ధారపోసిన పార్టీ.. తన వ్యవస్థాపక సూత్రాలు మరియు నైతికతను కోల్పోయింది” అని రాఘవ్ చద్ధా మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, బీజేపీ ‘ఆపరేషన్ లోటస్’ ద్వారా పంజాబ్ అభివృద్ధిని అడ్డుకోవడానికే తమ ఎంపీలను ప్రలోభపెట్టిందని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు