హెయిర్ డ్రైయర్‌తో వెదర్ సెన్సార్ టాంపరింగ్: రూ. 32 లక్షలు గెలుచుకున్న పారిస్ ‘బెట్టింగ్ రాయుడు’!

పారిస్‌లో ఒక వ్యక్తి హెయిర్ డ్రైయర్ సాయంతో వాతావరణ సెన్సార్‌ను తారుమారు చేసి, ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లో ఏకంగా రూ. 32 లక్షలు ($35,000) సంపాదించిన విస్తుగొలిపే ఘటన వెలుగులోకి వచ్చింది. పారిస్‌లోని చార్లెస్ డి గాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్న వాతావరణ కేంద్రం సెన్సార్‌ వద్ద ఉష్ణోగ్రతలను అసాధారణంగా పెంచడం ద్వారా ఈ స్కామ్‌కు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. పశ్చిమాసియా యుద్ధం మరియు ప్రపంచ మార్కెట్ల అనిశ్చితి మధ్య ఈ సరికొత్త రకం మోసం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

ఈ మోసం ఏప్రిల్ 6 మరియు ఏప్రిల్ 15 తేదీల్లో రెండుసార్లు జరిగింది. ఏప్రిల్ 6న మధ్యాహ్నం వరకు 18°C గా ఉన్న ఉష్ణోగ్రత, ఒక్కసారిగా 22°C కు పెరిగి మళ్ళీ వెంటనే తగ్గిపోయింది. సరిగ్గా అదే సమయంలో ‘పాలి మార్కెట్’ (Polymarket) అనే ప్రిడిక్షన్ ప్లాట్‌ఫామ్‌లో పారిస్ ఉష్ణోగ్రత 22°C కు చేరుతుందని పందెం కాసిన ఒక వ్యక్తి భారీగా లాభాలను ఆర్జించాడు. ఏప్రిల్ 15న కూడా ఉష్ణోగ్రతలను ఇలాగే ట్యాంపర్ చేసి రెండోసారి బెట్టింగ్ గెలుచుకున్నాడు. ఎయిర్‌పోర్ట్ సెన్సార్ వద్ద హెయిర్ డ్రైయర్‌ను పెట్టి వేడి గాలిని ఊదడం ద్వారా ఉష్ణోగ్రతలు పెరిగేలా చేశాడని వాతావరణ నిపుణులు అనుమానిస్తున్నారు.

ఈ వ్యవహారంపై ఫ్రాన్స్ వాతావరణ సంస్థ ‘మెయో ఫ్రాన్స్’ అధికారికంగా ఫిర్యాదు చేయడంతో పారిస్ పోలీసులు రంగంలోకి దిగారు. ఉష్ణోగ్రతలు సహజంగా పెరిగాయా లేక కావాలనే ట్యాంపర్ చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పాలి మార్కెట్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో రాజకీయం, క్రీడలతో పాటు వాతావరణ మార్పులపై కూడా పందాలు కాయవచ్చు. ఈ లూప్‌హోల్‌ను వాడుకుని వాతావరణాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని డబ్బు సంపాదించడం అధికారులను విస్మయానికి గురిచేసింది. నిందితుడు ఒక్కడేనా లేక విమానాశ్రయ సిబ్బంది సహకారం ఏమైనా ఉందా అనే దిశగా విచారణ కొనసాగుతోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు