కవిత కొత్త పార్టీ లోగోలో ‘Association’ మతలబు: టీఆర్ఎస్ పేరు కోసం మాస్టర్ ప్లాన్!

తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ ఉద్భవించింది. గతేడాది బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కల్వకుంట్ల కవిత, శుక్రవారం మునీరాబాద్‌ వేదికగా తన సొంత పార్టీ పేరు మరియు జెండాను ఆవిష్కరించారు. పార్టీకి తెలంగాణ రాష్ట్ర సేన (TRS) అని పేరు పెట్టిన కవిత, లోగోలో మాత్రం ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చారు. పేరు కింద చాలా చిన్న అక్షరాలతో ‘Association’ అనే పదాన్ని చేర్చారు. పాత ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ని గుర్తుకు తెచ్చేలా టీఆర్ఎస్ అనే పొట్టి పేరును వాడుకుంటూనే, సాంకేతికంగా ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఈ పదాన్ని జోడించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

పార్టీ పేరును గతంలో ఉన్న టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి)కి అత్యంత సమీపంగా ఉండేలా చూసుకోవడం వెనుక ఒక బలమైన రాజకీయ వ్యూహం కనిపిస్తోంది. తెలంగాణ సెంటిమెంట్‌ను, పాత టీఆర్ఎస్ గుర్తింపును మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్లడం కవిత ప్రధాన ఉద్దేశం. అయితే, ఒకే పేరుతో రెండు పార్టీలు ఉండకూడదనే నిబంధన ఉండటంతో, న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకు ‘అసోసియేషన్’ అనే తోకను తగిలించారు. పసుపు, నీలం, ఆకుపచ్చ రంగులతో కూడిన ఈ జెండా మధ్యలో తెలంగాణ మ్యాప్, అంబేద్కర్, జ్యోతిబా ఫూలే వంటి మహనీయుల చిత్రాలను ఉంచారు.

పార్టీ ఆవిర్భావ సభలో కవిత తన తండ్రి కేసీఆర్‌పై ఘాటు విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది. “కేసీఆర్ మన మనిషి కాదు.. ఆయన ఒక మర మనిషి (రోబో) లా మారిపోయారు” అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రెండేళ్లపాటు తాము ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని, వచ్చే ఎన్నికల్లో గెలిచి ‘మీ అమ్మ ప్రభుత్వం’ (ప్రజల ప్రభుత్వం) ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. పాంచజన్యం పేరుతో ఉచిత విద్య, వైద్యం, ఉపాధి వంటి ఐదు హామీలను ప్రకటించిన కవిత, తన తండ్రికి వ్యతిరేకంగా తెలంగాణ గడ్డపై కొత్త రాజకీయ సమరానికి శంఖారావం పూరించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు