తెలంగాణను కాంగ్రెస్, బీజేపీ పాలనల నుంచి విముక్తి చేసి, మళ్లీ బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో పార్టీ జెండాను ఎగురవేసిన ఆయన, ఢిల్లీ మెడలు వంచిన చరిత్ర తమ పార్టీకి ఉందని గుర్తుచేశారు. ప్రజల పక్షాన నిలబడి అణచివేతలకు వ్యతిరేకంగా నిరంతరం పోరాటం చేస్తామని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దశాబ్దాల పాటు జరిగిన అన్యాయాన్ని ఎదిరించిందని కేటీఆర్ పేర్కొన్నారు. 25 సంవత్సరాల క్రితం జలదృశ్యంలో కేసీఆర్ నాటిన ఈ మొక్క, నేడు ఒక మహావృక్షమై రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతోందని అన్నారు. 14 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమం తర్వాత రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా, పదేళ్ల పాలనలో తెలంగాణను దేశంలోనే అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలబెట్టిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని ఆయన ఉద్ఘాటించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న పరిస్థితులపై స్పందిస్తూ, ప్రజలు తమకు ఇచ్చిన ప్రతిపక్ష పాత్రను బీఆర్ఎస్ సమర్థవంతంగా పోషిస్తోందని కేటీఆర్ తెలిపారు. ఉద్యమ పార్టీగా, అధికార పార్టీగా మరియు ప్రస్తుతం ప్రతిపక్షంగా ప్రజల గొంతుకై నిలుస్తున్నామని చెప్పారు. రెండున్నరేళ్లుగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై పోరాడి, తెలంగాణలో మళ్లీ సంక్షేమ పాలనను పునరుద్ధరించడమే లక్ష్యమని ఆయన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.









