‘ఇది మన హైదరాబాదేనా?’ : సైకిల్ ట్రాక్‌పై యువతికి వేధింపులు.. భద్రతపై వెల్లువెత్తుతున్న ప్రశ్నలు

దేశంలోనే అత్యంత సురక్షితమైన నగరంగా పేరున్న హైదరాబాద్‌లో మహిళల భద్రతపై నీలి నీడలు కమ్ముకున్నాయి. గండిపేట పరిసరాల్లోని సోలార్ సైకిల్ ట్రాక్‌పై ఉదయం 6:15 గంటల సమయంలో రన్నింగ్ చేస్తున్న ఓ యువతికి ఒక వ్యక్తి నుంచి వికృత వేధింపులు ఎదురయ్యాయి. నిందితుడు ఆమె ముందు అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా, ఆమె కెమెరా తీసేలోపే అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ చేదు అనుభవాన్ని వివరిస్తూ సదరు యువతి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ ఘటనపై బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తూ పలు కీలక ప్రశ్నలను లేవనెత్తింది. సూర్యోదయం తర్వాత, జనం తిరుగుతున్న సమయంలోనే రక్షణ లేకపోతే ఎలా అని ఆమె ప్రశ్నించింది. రన్నింగ్ చేసేటప్పుడు ధరించే దుస్తులు కూడా కొందరికి అసభ్యంగా కనిపిస్తున్నాయని, ఆటోలు లేదా బైక్‌లపై వెళ్తున్నప్పుడు కూడా వేధింపులు తప్పడం లేదని వాపోయింది. “అసలు ఇది మనం చెప్పుకునే సురక్షితమైన హైదరాబాదేనా?” అంటూ ఆమె అడిగిన ప్రశ్న నగరవాసులను, ముఖ్యంగా మహిళలను ఆలోచింపజేస్తోంది.

ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తెలంగాణ పోలీసుల తీరుపై మండిపడుతున్నారు. మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన ‘షీ టీమ్స్’ మరియు పెట్రోలింగ్ వాహనాల నిఘా ఏమైందని నిలదీస్తున్నారు. ఐటీ కారిడార్ వంటి ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాల నిఘా పెంచాలని, ఇటువంటి వికృత చేష్టలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు తక్షణమే స్పందించి నిందితుడిని పట్టుకోవాలని సామాజిక మాధ్యమాల వేదికగా పోలీసు ఉన్నతాధికారులను కోరుతున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు