ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా, సాయి పల్లవి హీరోయిన్‌గా నటించిన హిందీ చిత్రం ‘ఏక్ దిన్’ (తెలుగులో ‘ఒక రోజు’). తాజాగా ఈ సినిమాను చూసిన ఆమిర్ ఖాన్ తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. ముంబైలో జరిగిన ఒక ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ, సాయి పల్లవిని మన దేశంలోనే ప్రస్తుతం ఉన్న అత్యుత్తమ నటిగా అభివర్ణించారు. ఆమె అద్భుతమైన ప్రతిభను కొనియాడుతూ, కథలోని ఎమోషన్‌కు తాను ఫిదా అయ్యానని ఆమిర్ పేర్కొన్నారు.
సినిమా విజయం కేవలం కలెక్షన్స్ మీదే ఆధారపడదని, కథకు ఎంతవరకు ప్రాణం పోశామన్నదే ముఖ్యమని ఆమిర్ ఖాన్ అభిప్రాయపడ్డారు. తనకు నచ్చని సినిమా బాక్సాఫీస్ వద్ద బాగా ఆడినా తాను సంతోషించలేనని, కానీ ‘ఏక్ దిన్’ విషయంలో నటీనటులు, దర్శకుడు పడిన కష్టం తెరపై కనిపిస్తోందని చెప్పారు. తెరపై తన కుమారుడు మరియు సాయి పల్లవి నటనను చూసి తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
సాయి పల్లవి కూడా ఈ సందర్భంగా తన స్పందనను తెలియజేశారు. ఆమిర్ ఖాన్ వంటి గొప్ప స్టార్ అందరి ముందు ఎమోషనల్ అవ్వడం ఆయన సంస్కారానికి నిదర్శనమని అన్నారు. తనకు హిందీ మాట్లాడటం కొత్త అని, ప్రేక్షకులు తనను ఎలా స్వీకరిస్తారోనని కొంత ఆందోళనగా ఉన్నట్లు వెల్లడించారు. మే 1న విడుదల కానున్న ఈ చిత్రం ద్వారా సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. జునైద్ ఖాన్ మంచి కో-యాక్టర్ అని చెబుతూ, తనకూ ఈ సినిమా చూస్తున్నప్పుడు కన్నీళ్లు వచ్చాయని ఆమె పంచుకున్నారు.









