“పాకిస్థాన్ మధ్యవర్తిత్వానికి పనికిరాదు”: అమెరికాతో చర్చలపై ఇరాన్ సంచలన వ్యాఖ్యలు

అమెరికా మరియు ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న పాకిస్థాన్ విశ్వసనీయతపై ఇరాన్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పాక్ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని, అగ్రరాజ్యం అమెరికా ప్రయోజనాలకే పెద్దపీట వేస్తోందని ఇరాన్ పార్లమెంట్ సాక్షిగా ఆ దేశ ప్రతినిధులు ధ్వజమెత్తారు. ఇరాన్ పార్లమెంట్‌లో జాతీయ భద్రత, విదేశాంగ విధాన కమిషన్ అధికార ప్రతినిధి ఇబ్రహీం రెజాయీ మాట్లాడుతూ.. పాకిస్థాన్ ఎప్పుడూ అమెరికా కనుసన్నల్లోనే మెలుగుతుంది తప్ప, వాషింగ్టన్ వైఖరిని సవాలు చేసే సాహసం దానికి లేదని స్పష్టం చేశారు.

శాంతి చర్చలు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవడానికి పాకిస్థాన్ అనుసరిస్తున్న ఏకపక్ష వైఖరే కారణమని ఇరాన్ భావిస్తోంది. ముఖ్యంగా లెబనాన్ వ్యవహారంలో అమెరికా అహేతుకమైన డిమాండ్లు పెట్టినప్పుడు కూడా పాకిస్థాన్ మౌనం వహించడాన్ని ఇరాన్ తప్పుబట్టింది. శాంతి ఒప్పందంపై సంతకాలు జరిగే వరకు ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధనాన్ని తొలగించే ప్రసక్తే లేదని అమెరికా భీష్మించుకోవడంతో, ఈ చర్చల ప్రక్రియ మరింత క్లిష్టంగా మారింది. తమ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్న దిగ్బంధనాన్ని ఎత్తివేస్తేనే చర్చల టేబుల్ ముందుకు వస్తామని ఇరాన్ తెగేసి చెబుతోంది.

పాకిస్థాన్ వైఖరిపై నమ్మకం కోల్పోయిన ఇరాన్, ఇప్పుడు తన దౌత్య మార్గాలను మార్చుకునే దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ రష్యా పర్యటనలో ఉండటం, పుతిన్ సాయం కోరడం చూస్తుంటే చర్చల వేదిక పాకిస్థాన్ నుంచి రష్యా లేదా ఒమన్‌కు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరాన్ నుండి ఇన్ని విమర్శలు వస్తున్నప్పటికీ, పాకిస్థాన్ మాత్రం తమ ద్వారా పరోక్ష చర్చలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అయితే, అమెరికా ఒత్తిళ్లకు లొంగుతున్న పాక్‌ను పక్కన పెట్టి మరో వేదికను ఎంచుకోవడమే ఇరాన్ తదుపరి వ్యూహంగా కనిపిస్తోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు