ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించిన నటి అషు రెడ్డి

బిగ్ బాస్ ఫేం, నటి అషు రెడ్డి తనపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. కనీసం తన వాదన వినకుండానే పోలీసులు ఏకపక్షంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకే నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, పోలీసుల తదుపరి చర్యలను నిలిపివేయాలని ఆమె న్యాయస్థానాన్ని కోరారు.

హైదరాబాద్ షేక్ పేట్‌కు చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి.. లండన్‌లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన తన కుమారుడు ధర్మేంద్రను అషు రెడ్డి ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసిందని సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైంది. 2018 నుంచి తన కొడుకు వద్ద డబ్బులు తీసుకుని కార్లు, ఆస్తులు, బంగారం కొనుగోలు చేసి తన పేరిట రిజిస్టర్ చేయించుకుందని, తీరా పెళ్లి మాట ఎత్తితే తప్పించుకు తిరుగుతోందని ఆ ఫిర్యాదులో ఆరోపించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు.

ఈ వివాదంపై అషు రెడ్డి మరియు ఆమె తండ్రి వెంకట కృష్ణారెడ్డి తీవ్రంగా స్పందించారు. తన ప్రమేయం లేకుండా తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని అషు రెడ్డి హెచ్చరించారు. సత్యనారాయణ కుటుంబానికి కాల్ మనీతో సంబంధాలు ఉన్నాయని, పైగా ధర్మేంద్రకు అప్పటికే పెళ్లై విడాకుల కేసు నడుస్తోందని తమ ఎంక్వైరీలో తెలియడంతోనే ఈ సంబంధాన్ని పక్కనపెట్టామని ఆమె తండ్రి కృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు