కవితకు ‘టీఆర్ఎస్’ షాక్: పార్టీ పేరు రిజిస్ట్రేషన్‌పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు!

తెలంగాణ రాజకీయాల్లో కొత్తగా పార్టీని ప్రకటించిన కల్వకుంట్ల కవితకు అనూహ్యమైన అడ్డంకి ఎదురైంది. ఆమె స్థాపించిన ‘తెలంగాణ రాష్ట్ర సేన’ (TRS) పేరును రిజిస్టర్ చేయవద్దని కోరుతూ తెలంగాణ రాజ్య సమితి అధ్యక్షుడు తుపాకుల బాలరంగం ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఇప్పటికే తన పార్టీని ‘టీఆర్ఎస్’ (TRS) అనే సంక్షిప్త నామంతో 2023లోనే రిజిస్టర్ చేయించానని, ఇప్పుడు అదే పేరుతో మరో పార్టీని అనుమతిస్తే తన పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని ఆయన లేఖలో పేర్కొన్నారు.

సిద్దిపేట జిల్లాకు చెందిన బాలరంగం తన పార్టీ ద్వారా బహుజనులకు రాజ్యాధికారం లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తన పార్టీ పది నియోజకవర్గాల్లో ‘గ్యాస్ సిలిండర్’ గుర్తుపై పోటీ చేసిందని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి ‘బీఆర్ఎస్’గా మారిన తర్వాత ఖాళీ అయిన టీఆర్ఎస్ పేరును తాను చట్టబద్ధంగా దక్కించుకున్నానని, కాబట్టి అదే పొట్టి పేరుతో వేరే ఎవరికీ రిజిస్ట్రేషన్ ఇవ్వకూడదని ఆయన డిమాండ్ చేశారు.

కవిత కేవలం నాలుగు రోజుల క్రితమే తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. పాత టీఆర్ఎస్ సెంటిమెంట్‌ను తిరిగి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆమె ఈ పేరును ఎంచుకున్నారు. అయితే, అప్పటికే అదే సంక్షిప్త నామంతో పార్టీ ఉనికిలో ఉండటం ఇప్పుడు ఆమెకు పెద్ద తలనొప్పిగా మారింది. ఎన్నికల సంఘం ఈ ఫిర్యాదుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు