సినీ పరిశ్రమలో ‘కాస్టింగ్ కౌచ్’ అనేది కేవలం మహిళలకు మాత్రమే పరిమితం కాలేదని, అబ్బాయిలు కూడా ఇటువంటి వేధింపులను ఎదుర్కొంటారని ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. వేధింపులనేవి ఏ రూపంలోనైనా ఉండవచ్చని, ఇండస్ట్రీలో అందరూ అనుకున్నట్లుగా ఇది కేవలం ఒక వర్గానికి సంబంధించిన సమస్య కాదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఒకప్పుడు తాను విలన్‌గా ఎదుగుతున్న సమయంలో, తన స్నేహితురాలైన ఒక స్టార్ హీరోయిన్‌కు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తుచేస్తూ… ఒక నిర్మాత ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తుంటే తాను, నటుడు సురేశ్ మంచం కింద దాక్కుని ఆ మాటలన్నీ విన్నామని చెప్పి షాక్ ఇచ్చారు.
తన వ్యక్తిగత జీవితం మరియు పెళ్లి గురించి వస్తున్న పుకార్లపై జేడీ చక్రవర్తి తనదైన శైలిలో స్పందించారు. తనకు తెలియకుండానే సోషల్ మీడియాలో తనకు చాలా పెళ్లిళ్లు జరిగిపోతున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. అయితే, నటి మహేశ్వరితో తనకున్న అనుబంధం గురించి ప్రస్తావిస్తూ, గతంలో తామిద్దరం పెళ్లి చేసుకోవాలని భావించిన మాట నిజమేనని, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ఆలోచన కార్యరూపం దాల్చలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం తమ మధ్య ఉన్న స్నేహం అలాగే కొనసాగుతోందని వివరించారు.
ఇక తన గురువు, ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. వర్మకు అస్సలు కోపం రాదని అందరూ భావిస్తారని, కానీ అది నిజం కాదని జేడీ అన్నారు. ‘సత్య’ సినిమా షూటింగ్ సమయంలో వర్మ తీవ్రమైన భావోద్వేగానికి లోనైన సందర్భాలు ఉన్నాయని, ఆయనకు కూడా కోపం వస్తుందని వెల్లడించారు. జేడీ చక్రవర్తి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి.









