బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల విద్యార్థులతో ముచ్చటిస్తూ తన ఇంటర్మీడియట్ రోజులకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన మిత్రుడి కోసం పట్టుబట్టి మరీ గుంటూరులోని విజ్ఞాన్ కాలేజీలో చేరానని, ఆ సమయంలో తన తండ్రి కేసీఆర్ స్వయంగా కారు నడుపుకుంటూ తనను అక్కడ దింపారని గుర్తు చేసుకున్నారు. లెక్కలంటే భయం ఉన్నప్పటికీ, అక్కడ అనుకున్న గ్రూపులు లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బైపీసీ (BiPC) తీసుకున్నానని సరదాగా వ్యాఖ్యానించారు.
కాలేజీలో జరిగిన ఒక సంఘటనను వివరిస్తూ.. సంస్కృతం సబ్జెక్టుపై ఓవర్ కాన్ఫిడెన్స్‌తో పరీక్ష రాయగా కేవలం 4 మార్కులు మాత్రమే వచ్చాయని కేటీఆర్ తెలిపారు. దీనికి ఆగ్రహించిన సంస్కృతం మాస్టారు సీతారామయ్య గారు తన గూబ మీద ఒక్కటిచ్చారని, టీచర్లు కొడతారని తనకు అప్పుడే మొదటిసారి తెలిసిందని నవ్వుతూ చెప్పారు. ఆ దెబ్బతో పట్టుదల పెరిగి కష్టపడి చదివి ఇంటర్మీడియట్‌లో స్టేట్ 11వ ర్యాంక్ సాధించానని వెల్లడించారు.
కేటీఆర్ తన విద్యా నేపథ్యం గురించి చెబుతూ.. ఇంటర్ తర్వాత హైదరాబాద్‌లో డిగ్రీ, పూణే యూనివర్సిటీలో ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ పూర్తి చేశానని తెలిపారు. ఆపై అమెరికాలో ఎంబీఏ చేసి అక్కడే ఆరేళ్ల పాటు ఉద్యోగం చేశానని వివరించారు. రాజకీయాల్లోకి రాకముందు తన వ్యక్తిగత మరియు విద్యా ప్రయాణంలోని ఈ చిరు జ్ఞాపకాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.









