ఐపీఎల్ 2026 సీజన్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టులో కీలక మార్పు చోటుచేసుకుంది. గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరమైన పేసర్ శివమ్ మావి స్థానంలో యువ ఆల్‌రౌండర్ ఆర్ఎస్ అంబరీష్‌ను జట్టులోకి తీసుకున్నట్లు ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. గజ్జల్లో గాయంతో మావి తప్పుకోవడంతో, అండర్-19 ప్రపంచకప్‌లో సత్తా చాటిన అంబరీష్‌ను రూ. 30 లక్షల బేస్ ప్రైస్‌కు ఎస్‌ఆర్‌హెచ్ ఒప్పందం చేసుకుంది.
చెన్నైకి చెందిన అంబరీష్ ఈ ఏడాది జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. కుడిచేతి వాటం మీడియం పేసర్ మరియు ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన ఆయన, ఆ టోర్నీలో మొత్తం 11 వికెట్లు తీసి భారత్ తరఫున టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. అటు బంతితోనూ, ఇటు బ్యాట్‌తోనూ రాణించగల సామర్థ్యం ఉండటంతో అంబరీష్ చేరిక జట్టుకు అదనపు బలాన్ని ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ జట్టును గాయాల సమస్య గట్టిగానే వేధిస్తోంది. ఇప్పటికే శివమ్ మావితో కలిపి మొత్తం నలుగురు ఆటగాళ్లు గాయాల వల్ల దూరం కాగా, వారి స్థానంలో డేవిడ్ పేన్, గెరాల్డ్ కోయెట్జీ, దిల్షాన్ మధుశంక వంటి వారిని రీప్లేస్‌మెంట్‌లుగా తీసుకున్నారు. ప్రస్తుతం వరుసగా ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న హైదరాబాద్ జట్టు, మే 3 (ఆదివారం) నాడు ఉప్పల్ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది.









