తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తనదైన శైలిలో మరోసారి వార్తల్లో నిలిచారు. తన జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీయాలని ఉందని, ఆ చిత్రాన్ని తానే స్వయంగా నిర్మిస్తానని ఆయన ప్రకటించారు. తన పాత్రకు ఏ హీరో సరిపోతారో దర్శకుడు సూచిస్తే, ఆ హీరోనే ఎంపిక చేస్తామని, ఆ సినిమాలో తాను కూడా ఒక ప్రధాన పాత్రలో కనిపిస్తానని మల్లారెడ్డి వెల్లడించారు.
ఇదే క్రమంలో పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో తనకు విలన్ పాత్ర ఆఫర్ వచ్చిందని ఆయన సంచలన విషయం చెప్పారు. అయితే, ఆ ఆఫర్‌ను తాను సున్నితంగా తిరస్కరించినట్లు తెలిపారు. విలన్ అంటే హీరో చేతిలో దెబ్బలు తినాల్సి ఉంటుందని, వేలాది మంది తన విద్యార్థులు, అభిమానుల ముందు తాను అలా హీరోతో తన్నులు తినడం ఇష్టం లేకనే ఆ పాత్రను వదులుకున్నానని ఆయన వివరించారు.
త్వరలోనే తాను వెండితెరపైకి వస్తానని, తన బయోపిక్ ద్వారా తన ప్రయాణాన్ని ప్రజలకు చూపిస్తానని మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాల్లో తనదైన ‘ట్రేడ్ మార్క్’ స్పీచ్‌లతో అలరించే ఆయన, ఇప్పుడు సినిమాల గురించి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజకీయ నేతగా సక్సెస్ అయిన మల్లారెడ్డి, సినీ నిర్మాతగా ఏ మేరకు రాణిస్తారో చూడాలని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.









