స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న తన చెల్లి షిమన్ మందన్న 13వ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. తన చెల్లిని గట్టిగా హత్తుకున్న ఫోటోతో పాటు, కేక్ కట్ చేస్తున్న క్యూట్ ఫోటోలను పంచుకుంటూ.. “నా స్వీటీకి 13వ పుట్టినరోజు శుభాకాంక్షలు! ఈ వయసును ఆస్వాదించు.. ఐ లవ్ యూ!” అంటూ తన ప్రేమను కురిపించారు. రష్మికకు తన చెల్లికి మధ్య 16 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉండటంతో, ఆమెను తన కూతురిలా చూసుకుంటానని రష్మిక గతంలోనే వెల్లడించారు.
ఈ సందర్భంగా రష్మిక తన వ్యక్తిగత జీవితం గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉదయ్‌పూర్‌లో నటుడు విజయ్ దేవరకొండతో జరిగిన తన వివాహానికి షిమన్ హాజరైందని ఆమె పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో రష్మిక తన పెళ్లి వార్తలను మరోసారి ధ్రువీకరించినట్లయింది. ప్రస్తుతం రష్మిక తన చెల్లిపై కురిపిస్తున్న ఈ ఆప్యాయత నెట్టింట వైరల్‌గా మారింది.
సినిమాల విషయానికొస్తే, రష్మిక ప్రస్తుతం “మైసా” అనే యాక్షన్ థ్రిల్లర్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలోని గిరిజన యువతి పాత్ర మరియు యాక్షన్ సన్నివేశాల కోసం ఆమె బ్యాంకాక్‌లో రోజుకు 8 గంటల పాటు కఠినమైన శిక్షణ తీసుకున్నారు. ప్రస్తుతం కేరళలో ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. ఇది కాకుండా, హిందీలో షాహిద్ కపూర్ మరియు కృతి సనన్‌లతో కలిసి “కాక్‌టెయిల్ 2” చిత్రంలో కూడా ఆమె నటించబోతున్నారు.









