తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకే (TVK) పార్టీ తరఫున మరో ఆసక్తికర విజయం నమోదైంది. నటుడు విజయ్ వద్ద గత 35 ఏళ్లుగా డ్రైవర్‌గా, వ్యక్తిగత సహాయకుడిగా (PA) పనిచేస్తున్న రాజేంద్రన్ కుమారుడు ఆర్. శబరినాథన్ విరుగంబాక్కం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సమీప డీఎంకే అభ్యర్థి ప్రభాకరరాజాపై 27,086 ఓట్ల భారీ మెజార్టీతో శబరినాథన్ విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు.
30 ఏళ్ల శబరినాథన్ తన తండ్రి యజమాని అయిన విజయ్‌పై ఉన్న నమ్మకంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. రాజేంద్రన్ విజయ్ నటించిన తొలి చిత్రం ‘నాలైయ తీర్పు’ కాలం నుండి ఆయన వెంటే ఉండటం గమనార్హం. ఒక సామాన్య కుటుంబానికి చెందిన వ్యక్తికి టిక్కెట్ ఇచ్చి, అసెంబ్లీకి పంపడం ద్వారా విజయ్ తన పార్టీలో సామాన్యులకు ఇచ్చే ప్రాధాన్యతను నిరూపించుకున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
విజయం అనంతరం శబరినాథన్ మాట్లాడుతూ.. ఈ గెలుపును తన నాయకుడు విజయ్‌కు అంకితం ఇచ్చారు. తమిళనాడులో డీఎంకే పాలనకు విజయ్ ముగింపు పలికారనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ, తనపై నమ్మకం ఉంచిన ప్రజలకు సేవ చేస్తానని పేర్కొన్నారు. విరుగంబాక్కం నియోజకవర్గ చరిత్రలో డీఎండీకే, అన్నాడీఎంకే, డీఎంకే తర్వాత ఇప్పుడు టీవీకే జెండా ఎగరడం విశేషం.









