కొత్వాల్‌గూడలో అక్రమ మైనింగ్ క్రషర్ల కూల్చివేత విషయంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ వైఖరిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉదయం 9 గంటలకు విడుదల చేసిన ప్రకటనలో “రాఘవ కన్‌స్ట్రక్షన్స్” (మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన సంస్థ) క్రషర్లను కూల్చివేసినట్లు పేర్కొన్న హైడ్రా, కేవలం మూడు గంటల వ్యవధిలోనే అవి “తిరుమల కంపెనీ”వంటూ మాట మార్చడాన్ని ఆయన తప్పుపట్టారు. ఈ స్వల్ప వ్యవధిలో కమిషనర్‌ను ఎవరు బెదిరించారు లేదా ఎవరి ఒత్తిళ్లకు లొంగి ప్రకటన మార్చారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కూల్చివేసిన క్రషర్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డివేనని తాము ఆధారాలతో సహా నిరూపించామని దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న అక్రమ క్రషర్లపై చర్యలు తీసుకోవడాన్ని తాము సమర్థిస్తున్నప్పటికీ, ఒక మంత్రి సంస్థను కాపాడటానికి హైడ్రా ప్రయత్నించడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అసలు నేరస్తులను తప్పించి వేరే కంపెనీ పేరును తెరపైకి తేవడం కమిషనర్ విశ్వసనీయతను దెబ్బతీస్తోందని ఆయన మండిపడ్డారు.
మంత్రి పదవిలో ఉండి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అక్రమ మైనింగ్ ద్వారా సుమారు రూ. 500 కోట్ల విలువైన సహజ సంపదను తరలించారని శ్రవణ్ ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు పర్యావరణాన్ని, ప్రజా ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని తాము గతంలోనే హెచ్చరించామని గుర్తు చేశారు. దోచుకున్న ఈ భారీ సంపదను ప్రభుత్వం తిరిగి ఎలా రాబడుతుందో స్పష్టం చేయాలని, రియల్ ఎస్టేట్ ముసుగులో జరుగుతున్న దందాలపై ప్రభుత్వం పారదర్శకంగా విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.









