హైదరాబాద్ బేగంబజార్ పరిధిలో ఒక గొలుసు దొంగతనాన్ని అడ్డుకుని, రౌడీ షీటర్‌ను పట్టుకోవడంలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన ఆటో డ్రైవర్ మహమ్మద్ జాహెర్‌ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ప్రత్యేకంగా అభినందించారు. మార్నింగ్ వాక్ చేస్తున్న ఒక మహిళ మెడలోని బంగారు గొలుసును రౌడీ షీటర్ మహ్మద్ సోహేల్ లాక్కెళ్లేందుకు ప్రయత్నించగా, జాహెర్ తన ఆటోతో నిందితుడిని అడ్డుకున్నారు. ప్రాణాలకు తెగించి నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించడంలో కీలక పాత్ర పోషించిన జాహెర్‌కు సీపీ ప్రశంసా పత్రంతో పాటు నగదు పురస్కారాన్ని అందజేశారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాల ప్రకారం.. దొంగతనం చేసి స్కూటీపై పారిపోతున్న రౌడీ షీటర్‌ను జాహెర్ తన ఆటోతో ఢీకొట్టారు. కిందపడిపోయిన నిందితుడు కర్రతో దాడి చేసినా భయపడకుండా అతడిని బంధించి గోషామహల్ పోలీసులకు అప్పగించారు. సాహసం చేసిన అనంతరం ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా అక్కడి నుంచి వెళ్లిపోయిన జాహెర్‌ను, పోలీసులు సిసిటీవి ఫుటేజీ ఆధారంగా సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించారు. నిందితుడిపై గతంలో 16 కేసులు ఉన్నాయని, అతడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
సజ్జనార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, నేరం జరుగుతుంటే చూస్తూ ఉండిపోకుండా స్పందించిన జాహెర్ సమాజానికి నిజమైన రోల్ మోడల్ అని కొనియాడారు. “ప్రతి పౌరుడిలో ఒక పోలీస్ ఉన్నాడు” అనే విషయాన్ని జాహెర్ నిరూపించారని, ఇలాంటి బాధ్యతాయుతమైన వ్యక్తుల వల్లే నేరగాళ్లకు భయం పుడుతుందని పేర్కొన్నారు. నగరవాసులు కూడా నేరం జరిగినప్పుడు భయపడకుండా వెంటనే డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించి సామాజిక బాధ్యతను చాటుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.









