కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన విమర్శలపై రాష్ట్ర మంత్రి సీతక్క తీవ్రంగా స్పందించారు. కేటీఆర్ తన అహంకారపూరిత వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. రైతుల సంక్షేమం గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నాయకులకు లేదని, గత పదేళ్ల పాలనలో రైతులను అనేక ఇబ్బందులకు గురిచేశారని ఆమె మండిపడ్డారు.
బీఆర్ఎస్ హయాంలో రైతు రుణమాఫీని నాలుగు విడతలుగా విభజించి రైతులను మోసం చేశారని సీతక్క ఆరోపించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను కేసీఆర్ ప్రభుత్వం ఏనాడూ పట్టించుకోలేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అటువంటి కుటుంబాలకు భరోసా కల్పించిందని తెలిపారు. రైతు బంధు నిధుల విడుదల కోసం గతంలో రైతులు ఎదురుచూడాల్సి వచ్చేదని, తమ ప్రభుత్వం కేవలం 9 రోజుల్లోనే రూ. 9 వేల కోట్లు విడుదల చేసిందని ఆమె గుర్తు చేశారు.
తాము ప్రజల మధ్య ఉంటూ సమస్యలను పరిష్కరిస్తున్నామని, ఫామ్ హౌస్‌లకే పరిమితమైన చరిత్ర తమది కాదని కేటీఆర్‌కు చురకలంటించారు. గత ప్రభుత్వంలో జరిగిన కమిషన్ల దందాల గురించి అందరికీ తెలుసని, ఇప్పుడు కొత్తగా నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తే భవిష్యత్తులో ప్రజలే బీఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని సీతక్క హెచ్చరించారు.









