జర్మనీలోని రూట్‌లింగెన్ నగరంలో ఉన్న ‘స్ప్రూయర్‌హాఫ్‌స్ట్రాస్సే’ (Spreuerhofstrasse) వీధి ప్రపంచంలోనే అత్యంత ఇరుకైన వీధిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. చూడ్డానికి రెండు భవనాల మధ్య ఉన్న చిన్న సందులా కనిపించే దీనిని అధికారికంగా పబ్లిక్ వీధిగానే గుర్తించారు. అత్యంత ఇరుగ్గా ఉండే చోట ఈ వీధి వెడల్పు కేవలం 31 సెంటీమీటర్లు (12.2 అంగుళాలు) మాత్రమే ఉండగా, కాస్త వెడల్పుగా ఉన్న ప్రాంతంలో 50 సెంటీమీటర్లు మాత్రమే ఉంటుంది.
ఈ అత్యంత ఇరుకైన వీధి ఏర్పాటు వెనుక ఒక ఆసక్తికరమైన చరిత్ర దాగి ఉంది. 1726వ సంవత్సరంలో రూట్‌లింగెన్ నగరంలో సంభవించిన ఓ భారీ అగ్నిప్రమాదంలో నగరం చాలా వరకు కాలిపోయి నాశనమైంది. అనంతరం నగరాన్ని పునర్నిర్మించే క్రమంలో రెండు భవనాల మధ్య అనుకోకుండా ఈ చిన్న ఖాళీ ఏర్పడింది. కాలక్రమేణా దానికి వీధిగా గుర్తింపు లభించగా, 1820లో దీనిని అధికారికంగా ‘వీధి నంబర్ 77’గా రికార్డుల్లో నమోదు చేశారు.
ప్రస్తుతం ఈ వింతైన వీధి ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారి ప్రపంచం నలుమూలల నుంచి టూరిస్టులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ ఇరుకైన మార్గంలో ఒకేసారి ఒక్కరు మాత్రమే, అది కూడా నిటారుగా కాకుండా పక్కకు తిరిగి నెమ్మదిగా వెళ్లాల్సి ఉంటుంది. కాస్త లావుగా ఉన్నవారు లేదా బ్యాగులు తగిలించుకున్న వారు ఇందులోంచి వెళ్లడం దాదాపు అసాధ్యం. నగరంలోని భిన్నమైన ప్రదేశాలను అన్వేషించాలని కోరుకునే పర్యాటకులు ఇక్కడికి చేరుకుని ఫొటోలు దిగుతూ ఈ వింత అనుభూతిని ఆస్వాదిస్తుంటారు.









