విజయ్ నిర్ణయాలు అభినందనీయం: 717 మద్యం దుకాణాల మూసివేతపై కమల్ హాసన్ ప్రశంసలు

తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నటుడు విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలపై విశ్వనటుడు కమల్ హాసన్ ప్రశంసల జల్లు కురిపించారు. ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, ప్రార్థనా మందిరాలకు సమీపంలో ఉన్న 717 మద్యం దుకాణాలను మూసివేయాలని విజయ్ తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైనదని కమల్ కొనియాడారు. ఈ చర్య వల్ల సమాజంలో సానుకూల మార్పులు వస్తాయని, బాధ్యతాయుతమైన నాయకుడిగా విజయ్ తన ముద్ర వేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

విజయ్‌ను ఇప్పుడు కేవలం ఒక నటుడిగానే చూడవద్దని, ఆయన భుజాన రాష్ట్ర ప్రయోజనాలనే పెద్ద బాధ్యత ఉందని కమల్ గుర్తుచేశారు. ఒక నటుడు ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం గర్వకారణమని, ఆయన తీసుకునే ప్రజాహిత నిర్ణయాలకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. మద్యం దుకాణాల తొలగింపు వంటి సామాజిక సంస్కరణలను భవిష్యత్తులోనూ నిరంతరాయంగా కొనసాగించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.

విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి కమల్ హాసన్ ఆయనకు వెన్నంటి ఉంటూ తన రాజకీయ అనుభవాన్ని పంచుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా విజయ్‌కు అభినందనలు తెలపడమే కాకుండా, క్షేత్రస్థాయిలో ఆయన అమలు చేస్తున్న విధానాలను కమల్ స్వాగతించడం తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఇద్దరు దిగ్గజ నటుల మధ్య ఉన్న ఈ రాజకీయ సాన్నిహిత్యం తమిళనాడులో కొత్త సమీకరణాలకు దారితీస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు