ఉద్యోగమే మీ గుర్తింపు కాదు: గూగుల్ ఆఫీస్ ముందు భారతీయ మహిళ వీడియో వైరల్

న్యూయార్క్‌లోని గూగుల్ కార్యాలయం వెలుపల నుపుర్ డేవ్ అనే మహిళ పోస్ట్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ముఖ్యంగా విదేశాల్లో స్థిరపడిన భారతీయులు తమ ఉద్యోగ హోదాను, కంపెనీ పేరును తమ వ్యక్తిగత గుర్తింపుగా మార్చుకోవడాన్ని ఆమె ఈ వీడియోలో ప్రశ్నించారు. పార్టీలు లేదా సామాజిక సమావేశాల్లో కలిసినప్పుడు తమను తాము పరిచయం చేసుకునే క్రమంలో పని చేసే కంపెనీ, హోదా, జీతం వంటి వివరాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని ఆమె అభిప్రాయపడ్డారు.

భారతీయ కుటుంబాల్లో ఉద్యోగ టైటిల్‌కు లభించే అమితమైన గౌరవం, బంధువుల మెప్పు వంటి కారణాల వల్ల చాలామంది తమ ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా కెరీర్‌తో ముడిపెట్టుకుంటున్నారని నుపుర్ విశ్లేషించారు. ఇలాంటి వారు కంపెనీల్లో లేఆఫ్‌లు (ఉద్యోగ కోతలు) జరిగినప్పుడు లేదా పనితీరు ఆశించిన స్థాయిలో లేనప్పుడు మానసికంగా తీవ్రంగా కుప్పకూలిపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఉద్యోగంపైనే ఆధారపడకుండా, తమ అభిరుచులను (Hobbies) కాపాడుకుంటూ గుర్తింపును విస్తరించుకోవాలని ఆమె సూచించారు.

“మీ పెట్టుబడుల పోర్ట్‌ఫోలియో లాగే మీ గుర్తింపును కూడా విభిన్నంగా (Diversify) మార్చుకోండి” అంటూ ఆమె నెటిజన్లకు పిలుపునిచ్చారు. ఉద్యోగం అనేది మనం జీవనం కోసం చేసే పని మాత్రమేనని, అది మన వ్యక్తిత్వాన్ని పూర్తిస్థాయిలో నిర్వచించలేదని స్పష్టం చేశారు. సల్సా నేర్చుకోవడం, స్టార్టప్‌లకు సలహాలు ఇవ్వడం వంటి ఇతర వ్యాపకాలపై దృష్టి పెట్టే వారు ఉద్యోగం కోల్పోయినా దృఢంగా ఉండగలుగుతారని, ఈ జీవనశైలిని అలవర్చుకోవాలని ఆమె కోరారు. ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు, ఇది నేటి కార్పొరేట్ ప్రపంచంలోని వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోందని ప్రశంసిస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు