కరీంనగర్ పట్టణంలో పట్టపగలే జరిగి సంచలనం సృష్టించిన పీఎంజే (PMJ) జ్యువెలరీ షాపు దోపిడీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ దోపిడీకి పాల్పడింది అంతర్రాష్ట్ర ముఠా అయిన ‘సుబోధ్ సింగ్ గ్యాంగ్’ అని నిర్ధారించిన పోలీసులు, ఆ ముఠాకు చెందిన ముగ్గురు సభ్యులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో మొత్తం 13 మంది నిందితులను గుర్తించగా, వారిలో ప్రధాన నాయకత్వం వహించిన రఘునాథ్ కర్మకార్‌తో పాటు రవిష్ కుమార్, మెహతాబ్ ఖాన్‌లను పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో పట్టుకున్నట్లు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం వెల్లడించారు.
దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం.. ఈ భారీ దోపిడీకి ప్రధాన సూత్రధారి సుబోధ్ సింగ్ ప్రస్తుతం బీహార్‌లోని పూర్నియా జైలులో ఉంటూనే పథక రచన చేశాడు. ఈ ముఠాకు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో దోపిడీలు చేసిన చరిత్ర ఉంది. తెలంగాణలో కూడా రెండు నెలల ముందే ఖమ్మం, మంచిర్యాల, జగిత్యాల వంటి ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి చివరకు కరీంనగర్‌లోని జ్యువెలరీ షాపును ఎంచుకున్నారు. ఈ నెల 3న జరిగిన ఈ ఘటనలో దుండగులు కాల్పులు జరిపి 161 తులాల బంగారు ఆభరణాలు, 112 క్యారెట్ల వజ్రాలను దోచుకెళ్లారు.
నిందితుల నుంచి ప్రస్తుతం నగదు, మొబైల్ ఫోన్లు మరియు నకిలీ గుర్తింపు కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ముఠాలోని మిగిలిన 10 మంది సభ్యుల కోసం ప్రత్యేక బృందాలు వివిధ రాష్ట్రాల్లో గాలింపు ముమ్మరం చేశాయి. దర్యాప్తుకు ఆటంకం కలుగకుండా పరారీలో ఉన్న వారి వివరాలను ప్రస్తుతానికి గోప్యంగా ఉంచారు. జైలులో ఉన్న ప్రధాన సూత్రధారి సుబోధ్ సింగ్‌ను విచారించేందుకు కోర్టు అనుమతి కోరుతున్నామని, త్వరలోనే దోపిడీకి గురైన పూర్తి సొత్తును రికవరీ చేస్తామని కమిషనర్ ఆశాభావం వ్యక్తం చేశారు.









