పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ముడి చమురు ధరలు పెరగడం, సరఫరాలో అంతరాయాలు కలగడం వల్ల భారత్ వంటి దేశాల్లో ఇంధన కొరత ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం అప్రమత్తమై ఇంధన అమ్మకాలపై కీలక పరిమితులు విధించింది. రిటైల్ అవుట్‌లెట్లలో నిల్వలు అకస్మాత్తుగా తగ్గిపోకుండా ఉండటం మరియు పంపిణీని స్థిరీకరించడమే లక్ష్యంగా వినియోగదారులకు గరిష్టంగా 200 లీటర్ల డీజిల్, ₹5,000 విలువైన పెట్రోల్‌ను మాత్రమే విక్రయించాలని నిబంధనలు విధించినట్లు సమాచారం.
భారత్ ప్రస్తుతం తన ముడి చమురు అవసరాల కోసం గల్ఫ్ దేశాలపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. యుద్ధం కారణంగా సముద్ర మార్గాల్లో రవాణాకు ఆటంకాలు కలగడంతో, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వద్ద సుమారు రెండు నెలలకు సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని చెబుతున్నప్పటికీ, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ‘పొదుపు మంత్రం’ పాటించాలని పిలుపునిచ్చారు. దీనిని పాటిస్తూ కేరళలోని 2,500 పెట్రోల్ బంకుల్లో పంపిణీని క్రమబద్ధీకరించేందుకు రాష్ట్ర వ్యాపారుల సంఘం ఈ తాత్కాలిక ఆంక్షలను అమలు చేస్తోంది.
ఈ పరిమితులు సాధారణ వాహనదారుల కంటే బల్క్ కొనుగోలుదారులు మరియు లాజిస్టిక్స్ ఆపరేటర్లపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆయిల్ కంపెనీలు ప్రస్తుతం బంకులకు ముందస్తు చెల్లింపు నిబంధనలను ప్రవేశపెట్టడం వల్ల బంకు యజమానులపై కూడా ఆర్థిక భారం పెరిగింది. అయితే, దేశవ్యాప్తంగా ఇంధనానికి అధికారికంగా ఎలాంటి కొరత లేదని, కేవలం రవాణాలో జాప్యం వల్ల తలెత్తే ఇబ్బందులను అధిగమించేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. యుద్ధం మరింత ముదిరితే రానున్న రోజుల్లో మరిన్ని రాష్ట్రాలు ఇటువంటి పొదుపు చర్యలు చేపట్టే అవకాశం ఉంది.









