మెదక్‌లో దొంగల బీభత్సం: ఒకే రాత్రి నాలుగు ఇళ్లలో దోపిడీ.. 120 తులాల బంగారం అపహరణ

మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం చీలపల్లి గ్రామంలో దొంగలు ఘోరానికి ఒడిగట్టారు. ఒకే రాత్రి వరుసగా నాలుగు ఇళ్లలో చొరబడి భారీగా బంగారం, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ వరుస చోరీలతో గ్రామస్థులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. గ్రామానికి చెందిన రాయిని రాములు అనే వ్యక్తి కుటుంబం పెళ్లి నిమిత్తం ఊరెళ్లగా, దొంగలు వారి ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న సుమారు 120 తులాల బంగారం, కిలో వెండిని అపహరించుకుపోయారు.

ఉదయం ఇంటికి వచ్చిన పనిమనిషి తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గమనించి యజమానులకు సమాచారం అందించడంతో ఈ భారీ దోపిడీ వెలుగులోకి వచ్చింది. దొంగలు కేవలం రాములు ఇంటితో ఆగకుండా, అదే గ్రామంలోని మాణిక్యరెడ్డి అనే వ్యక్తి ఇంటితో పాటు మరో రెండు ఇళ్లలో కూడా చోరీలకు పాల్పడ్డారు. మాణిక్యరెడ్డి ఇంట్లో రెండు తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. వివాహ వేడుకలకు వెళ్లే కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని దొంగలు ఈ పథకం ప్రకారం దోపిడీ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

బాధితుల ఫిర్యాదు మేరకు అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. క్లూస్ టీమ్ రంగంలోకి దిగి వేలిముద్రలు, ఇతర కీలక ఆధారాలను సేకరించింది. ఒకే గ్రామంలో, అది కూడా ఒకే రాత్రి నాలుగు ఇళ్లలో చోరీలు జరగడం స్థానికంగా కలకలం రేపుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రాత్రి సమయాల్లో గస్తీ పెంచాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు