పర్యాటక ప్రాంతాలను విస్తృతంగా ప్రచారం చేయాలి. జిల్లా కలెక్టర్ అంకిత్.

ప్రచురణార్థం
21-05-2026.

పర్యాటక ప్రాంతాలను విస్తృతంగా ప్రచారం చేయాలి. జిల్లా కలెక్టర్ అంకిత్.

పర్యాటక వారోత్సవాల్లో భాగంగా గోడపత్రిక ఆవిష్కరణ.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో. మే 21
టుడే 9 ప్రతినిధి

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న పర్యాటక వారోత్సవాల సందర్భంగా జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ అంకిత్ గురువారం ఐడిఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, పర్యాటక శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సహజ సిద్ధమైన అటవీ ప్రాంతాలు, జలాశయాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు, పర్యావరణ పర్యాటక ప్రాంతాలు విస్తారంగా ఉన్నాయని తెలిపారు. జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన కిన్నెరసాని, భద్రాచలం దేవస్థానం, తుమ్మలచెరువు, బెంగాలపాడు, పర్ణశాల తదితర ప్రాంతాలను సోషల్ మీడియా వేదికల ద్వారా దేశవ్యాప్తంగా ప్రజలకు చేరవేయాల్సిన అవసరం ఉందన్నారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు తమ వీడియోలు, ఫొటోలు, ప్రత్యేక కథనాల ద్వారా పర్యాటక ప్రాంతాల విశిష్టతను ప్రజలకు తెలియజేయాలని సూచించారు.

జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధి ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, చిన్న వ్యాపారులు, హస్తకళాకారులు, గిరిజన ఉత్పత్తుల విక్రేతలకు ఆదాయం పెరిగే అవకాశం ఉంటుందని కలెక్టర్ తెలిపారు . జిల్లాలోని పర్యాటక ప్రదేశాల సహజ సౌందర్యం, ఆధ్యాత్మిక ప్రాధాన్యత, చారిత్రక విశేషాలను ఆకర్షణీయంగా ప్రజలకు చేరవేస్తే మరింత మంది పర్యాటకులు జిల్లాకు వచ్చే అవకాశముందని తెలిపారు.

సోషల్ మీడియా ద్వారా పర్యాటక ప్రాంతాల ప్రచారం వేగంగా విస్తరిస్తోందని, యువత ఎక్కువగా డిజిటల్ వేదికలను వినియోగిస్తున్న నేపథ్యంలో ఇన్‌ఫ్లుయెన్సర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. పర్యాటక ప్రాంతాల్లో పరిశుభ్రత పరిరక్షణ, ప్రకృతి సంరక్షణ, స్థానిక సంప్రదాయాలకు గౌరవం కల్పించేలా ప్రచారం చేయాలని తెలిపారు. జిల్లాలోని ప్రతి పర్యాటక ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

అనంతరం పర్యాటక వారోత్సవాల్లో భాగంగా జిల్లాలోని పర్యాటక ప్రాంతాల విశేషాలు, చారిత్రక ప్రాధాన్యత, సందర్శనీయ స్థలాల వివరాలతో రూపొందించిన గోడపత్రికను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పర్యటక శాఖ, జిల్లా క్రీడా శాఖ అధికారి పరందామరెడ్డి , వివిధ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు