ఇది మిషన్ మోడ్ కాదు.. కమీషన్ మోడ్: సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ధ్వజం!

వరి కొనుగోళ్ల జాప్యంపై హరీశ్ రావు ఆగ్రహం:

తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగుతోందని, ఐకేపీ (IKP) సెంటర్లలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్ పల్లి గ్రామంలోని ఐకేపీ కేంద్రాన్ని సందర్శించిన ఆయన, వడ్లను పరిశీలించి రైతుల ఆవేదనను అడిగి తెలుసుకున్నారు. సాగునీరు, కరెంట్, యూరియా సరఫరా నుంచి పండిన పంటను సేకరించే వరకు ప్రభుత్వం ప్రతి దశలోనూ ఫెయిల్ అయిందని మండిపడ్డారు. రోహిణి కార్తె ప్రవేశించినా సరే, ఇప్పటికీ ధాన్యం కళ్లాల్లోనే ఉండిపోవడం రాష్ట్ర చరిత్రలో ముందెన్నడూ చూడలేదన్నారు.

ధాన్యం కొనుగోళ్ల కోత – తరుగు దోపిడీ:

మొన్నటివరకు 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటామని చెప్పి, ఇప్పుడు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేవలం 70 లక్షల టన్నులే కొంటాం అనడం ఎంతవరకు సబబని హరీశ్ రావు ప్రశ్నించారు. రాష్ట్రంలో కోటి టన్నుల దిగుబడి వస్తే.. మిగిలిన 30 లక్షల టన్నుల ధాన్యాన్ని రైతులు ఏం చేసుకోవాలని నిలదీశారు. “తాలు పెడితే తోలు తీస్తా” అని సీఎం రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలుకుతున్నారని, కానీ క్షేత్రస్థాయిలో క్వింటాల్‌కు ఏకంగా 5 కిలోల చొప్పున తరుగు తీస్తూ రైతులను నిలువునా దోచుకుంటున్నారని ఆరోపించారు. ఈ కొనుగోళ్ల జాప్యం వల్ల వరి కుప్పలపైనే గుండెలు బాదుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 12 మంది రైతులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు.

కలెక్టరేట్ల దిగ్బంధనానికి గట్టి హెచ్చరిక:

ధాన్యాన్ని ‘మిషన్ మోడ్‌’లో కొంటున్నామనే సీఎం వ్యాఖ్యలను తిప్పికొడుతూ.. ఇది మిషన్ మోడ్ కాదు, పూర్తిగా ‘కమీషన్ మోడ్’ అని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి కేవలం ఒక “పేపర్ టైగర్” మాత్రమేనని, ముఖ్యమంత్రి తన ఢిల్లీ ట్రిప్పులను పక్కనబెట్టి, కళ్లాల్లో ఉన్న వడ్లను మిల్లులకు తరలించడానికి లారీల ట్రిప్పులను పెంచాలని హితవు పలికారు. ఒకటి రెండు రోజుల్లో కొనుగోళ్లలో మార్పు రాకపోతే, స్వయంగా తానే సిద్దిపేట కలెక్టరేట్ ఎదుట నిరవధిక ధర్నాకు దిగుతానని, అలాగే వేలాది మంది రైతులతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్లను దిగ్బంధిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వానికి హరీశ్ రావు గట్టి హెచ్చరిక జారీ చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు