ముమైత్ ఖాన్ తండ్రిది పాకిస్థాన్: ప్రమాదం తర్వాత మేకప్, స్టైలింగ్ రంగంలో స్థిరపడిన నటి

టాలీవుడ్‌లో ‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే’ అనే ఒక్క పాటతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారి, ఐదారేళ్ల పాటు తన ప్రత్యేక నృత్యాలతో ఊపేసిన ముమైత్ ఖాన్ కుటుంబానికి అంతర్జాతీయ నేపథ్యం ఉంది. ఆమె పుట్టి పెరిగిందంతా ముంబైలోనే అయినప్పటికీ.. ఆమె తండ్రి పాకిస్థాన్‌కు చెందినవారు కాగా, తల్లి తమిళనాడుకు చెందినవారు. ముమైత్ పుట్టిన తర్వాతే వారి కుటుంబం ముంబైకి వలస వచ్చింది. చిన్నతనంలోనే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న ఆమె, కుటుంబం కోసం కేవలం 13 ఏళ్ల వయసు నుంచే డ్యాన్సర్‌గా కెరీర్ ప్రారంభించారు.

సినిమాల్లో స్టార్ హీరోల చిత్రాల ఐటమ్ సాంగ్స్‌తో పాటు ‘మైసమ్మ ఐపీఎస్’ వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో ఆమె జీవితంలో ఒక ఘోర ప్రమాదం జరిగింది. ఆ యాక్సిడెంట్ వల్ల ముమైత్ మెదడులోని 5 నరాలు చిట్లిపోవడంతో ఆమె 15 రోజుల పాటు కోమాలోకి వెళ్లారు. కోమా నుంచి కోలుకున్నాక కనీసం ఏడేళ్ల పాటు ఎలాంటి పనులూ చేయకూడదని వైద్యులు కఠినమైన ఆంక్షలు విధించడంతో ఆమె సుదీర్ఘ కాలం వెండితెరకు, గ్లామర్ ప్రపంచానికి పూర్తిగా దూరమవ్వాల్సి వచ్చింది.

సినిమాలకు దూరమైన ఆ ఏడేళ్ల విరామంలోనే ముమైత్ ఒక కొత్త ఆలోచనతో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. తాను నటిగా బిజీగా ఉన్నప్పుడు హెయిర్ స్టైలింగ్, మేకప్ కిట్స్, స్టైలింగ్ టీమ్స్‌ను ముంబై నుంచి హైదరాబాద్‌కు రప్పించాల్సి వచ్చేదని.. అదే సేవలను హైదరాబాద్‌లోనే ఎందుకు అందుబాటులోకి తీసుకోరాకూడదనే ఉద్దేశంతో మేకప్, హెయిర్ స్టైలింగ్ బిజినెస్ ప్రారంభించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉంటూ ఈ వ్యాపారాన్ని తన పూర్తిస్థాయి కెరీర్‌గా ఎంచుకుని కొనసాగిస్తున్నారు. మధ్యలో బిగ్‌బాస్ తెలుగు సీజన్-1 లో మెరిసినప్పటికీ, ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులేవీ చేయకుండా కేవలం సోషల్ మీడియా ద్వారానే అభిమానులకు అడపాదడపా టచ్‌లో ఉంటున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు