దేశంలో న్యాయం చేకూరడంలో జరిగే కాలయాపనకు అడ్డుకట్ట వేస్తూ భారత సర్వోన్నత న్యాయస్థానం (సుప్రీం కోర్టు) సంచలన తీర్పును ఇచ్చింది. ‘తీర్పుల ఆలస్యం.. న్యాయాన్ని తిరస్కరించడమే’ అని స్పష్టం చేస్తూ దేశవ్యాప్తంగా ఉన్న హైకోర్టులకు గట్టి డెడ్‌లైన్ విధించింది. 2025లో జార్ఖండ్ హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పును వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడంలో జరిగిన జాప్యంపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన అనంతరం, భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆర్టికల్ 142 అధికారాలను ఉపయోగిస్తూ ఈ చారిత్రాత్మక మార్గదర్శకాలను జారీ చేసింది.
కొత్త నిబంధనల ప్రకారం.. హైకోర్టులలో వాదనలు ముగిసి తీర్పు తేదీని రిజర్వ్ చేసినప్పుడు, ఆ వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో స్పష్టంగా ప్రదర్శించాలి. తీర్పును రిజర్వ్ చేసిన తేదీ నుండి గరిష్టంగా మూడు నెలల లోపే ఆ తీర్పును తప్పనిసరిగా వెల్లడించాలి. ఒకవేళ మూడు నెలలు దాటినా తీర్పు రాకపోతే, రిజిస్ట్రార్ జనరల్ ఆ విషయాన్ని సంబంధిత హైకోర్టు చీఫ్ జస్టిస్ దృష్టికి తీసుకెళ్లాలి. అప్పుడు చీఫ్ జస్టిస్ మరో రెండు వారాల అదనపు సమయాన్ని ఇవ్వవచ్చు. ఆ గడువులోగా కూడా తీర్పు ఇవ్వని పక్షంలో.. ఆ కేసును సదరు న్యాయమూర్తుల నుండి పూర్తిగా తొలగించి, వేరే బెంచ్‌కు బదిలీ చేస్తారు.
దీనితో పాటు పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన బెయిల్ దరఖాస్తులపై సుప్రీం కోర్టు ప్రత్యేక మార్గదర్శకాలను ఇచ్చింది. బెయిల్ దరఖాస్తులపై వీలైనంత వరకు వాదనలు విన్న రోజే లేదా మరుసటి రోజే తీర్పులు ప్రకటించాలని స్పష్టం చేసింది. బెయిల్ మంజూరైన రోజునే ఆ ఆర్డర్ కాపీలను జైలు అధికారులకు వెంటనే పంపాలని, విచారణ ఖైదీలకు బెయిల్ లభించిన అదే రోజున లేదా మరుసటి రోజున జైలు నుంచి విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. తీర్పు చెప్పే రోజున కేవలం ముఖ్య భాగాన్ని మాత్రమే ఓపెన్ కోర్టులో చదివి వినిపించి, కారణాలతో కూడిన పూర్తి తీర్పు కాపీని 7 రోజుల్లోగా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.









