డీకే శివకుమార్ ప్రమాణస్వీకారంపై జ్యోతిషుల కీలక సూచన: సోమవారంలోగా పదవి చేపడితే 8 ఏళ్లు సీఎంగా ఉంటారని జోస్యం

కర్ణాటక రాజకీయాల్లో ఎట్టకేలకు అధికార మార్పిడి ఊపందుకుంది. సిద్ధరామయ్య తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కర్ణాటక పగ్గాలు చేపట్టడానికి మార్గం సుగమం అయింది. శనివారం జరగబోయే కాంగ్రెస్ శాసనసభా పక్ష (CLP) సమావేశంలో ఆయనను కొత్త ముఖ్యమంత్రిగా అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, తీవ్రమైన దైవభక్తి మరియు జ్యోతిషాన్ని బలంగా విశ్వసించే డీకే శివకుమార్ ఎప్పుడు ప్రమాణస్వీకారం చేస్తారనే అంశంపై ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో, ఆయన అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.

ప్రస్తుతం మే 17 నుండి జూన్ 15 వరకు ‘అధిక జ్యేష్ఠ మాసం’ (శూన్యమాసం) నడుస్తుండటంతో, సాధారణంగా ఇలాంటి కాలంలో ఎలాంటి శుభకార్యాలు లేదా కొత్త బాధ్యతలు చేపట్టడానికి ఎవరూ సాహసించరు. అయితే, సీఎం పదవి ఖరారైన తర్వాత అంతకాలం వేచి ఉండటం అసాధ్యం కావడంతో, డీకే శివకుమార్ తన నివాసానికి సమీపంలో ఉండే ప్రముఖ జ్యోతిష్యుడు ద్వారకానాథ్‌ను కలిసి ముహూర్తంపై సంప్రదింపులు జరిపారు. జూన్ ఒకటి లేదా మూడో తేదీలలో ప్రమాణస్వీకారానికి అనుకూలమైన ముహూర్తాలు ఉన్నాయని, ఆ తర్వాత నొణవినకెరె అజ్జయ్య పీఠాన్ని దర్శించుకుని దోష నివారణ పూజలు చేసుకోవాలని జ్యోతిష్యుడు ఆయనకు సూచించినట్లు తెలుస్తోంది.

ఈ పరిణామాలపై డీకే రాజగురువు ద్వారకానాథ్ మీడియాతో మాట్లాడుతూ.. డీకే శివకుమార్ గనుక రాబోయే సోమవారంలోపు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం పూర్తి చేస్తే, ఆయన సుదీర్ఘంగా 8 సంవత్సరాల పాటు సీఎంగా కొనసాగుతారని సంచలన జోస్యం చెప్పారు. గతంలో మాజీ సీఎం బంగారప్ప క్యాబినెట్‌లో అత్యంత చిన్న వయసులోనే జైళ్ల శాఖ మంత్రిగా డీకే బాధ్యతలు చేపట్టిన రోజే.. ఆయన భవిష్యత్తులో తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారని తాను అప్పుడే చెప్పానని గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం కొత్త సీఎం ఎంపిక మరియు క్యాబినెట్ కూర్పుపై ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో చర్చలు తుది దశకు చేరడంతో డీకే మద్దతుదారులు ఇప్పటికే సంబరాలు షురూ చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు