లెబనాన్‌పై దాడులు : ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, రక్షణ శాఖ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్

అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న శాంతి చర్చలు కొలిక్కిరావడం లేదు. తాజాగా అమెరికాతో చర్చల్ని ఇరాన్ నిలిపివేసినట్లు సమాచారం. ఇరాన్ మిత్రదేశమైన లెబనాన్‌పై ఇజ్రాయెల్ వరుసగా దాడులు చేస్తుండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది.ఈ అంశానికి సంబంధించి ఇరాన్‌కు చెందిన తన్సిమ్ అనే మీడియా సంస్థ కొన్ని విషయాల్ని వెల్లడించింది. ఇరాన్ సైనిక విభాగం అయిన ఐఆర్‌జీసీతో తన్సిమ్ సంస్థ కలిసి పని చేస్తుంటుంది. తన్సిమ్ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. అమెరికాతో చర్చల్ని ప్రస్తుతానికి ఇరాన్ నిలిపివేసింది.

లెబనాన్ వంటి తమ మిత్రపక్షాలపై ఇజ్రాయెల్ దాడులు ఆపనంతవరకు, వారి సూచనల్ని పరిగనణలోకి తీసుకోనంత వరకు చర్చలు జరిపేది లేదని ఇరాన్ తేల్చిచెప్పింది. అమెరికాతో ఒక పక్క చర్చలు జరుగుతున్నప్పటికీ.. ఇజ్రాయెల్ మాత్రం లెబనాన్‌పై దాడులు చేస్తూనే ఉంది. సోమవారం లెబనాన్ రాజధాని బీరుట్ పరిసర ప్రాంతాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. నిజానికి ఇప్పటికే లెబనాన్‌పై ఇజ్రాయెల్ పట్టుసాధించినట్లు తెలుస్తోంది. లెబనాన్ భూభాగంలోకి ఇజ్రాయెల్ దళాలు చొచ్చుకెళ్లాయి. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఈ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ దక్కించుకుంది.

లెబనాన్‌పై దాడులు చేయాల్సిందిగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, రక్షణ శాఖ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ ఆదేశించారు. లెబనాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ హెజ్‌బొల్లా వరుసగా కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడటం వల్లే తాము దాడులు చేస్తున్నామని ప్రకటించింది. ఇదే సమయంలో హెజ్‌బొల్లా కూడా ఇజ్రాయెల్‌పై రాకెట్ దాడులు చేసింది. అక్కడి తీర ప్రాంతమైన హైఫా ప్రాంతంలో దాడులు చేసినట్లు తెలుస్తోంది. అయితే, హెజ్‌బొల్లా దాడుల్ని తాము తిప్పికొట్టినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ దాడుల నేపథ్యంలో మిడిల్ ఈస్ట్‌ ప్రాంతంలో మళ్లీ ఉద్రిక్తతలు పెరిగాయి. ఇక, ఇరాన్, అమెరికా మధ్య మళ్లీ శాంతి చర్చలు ఎప్పుడు ప్రారంభమవుతాయో చూడాలి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు