పంజాబ్‌లోని మొహాలీ సాఫ్ట్‌వేర్ హబ్ పరిధిలో గురువారం రాత్రి ఒక అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఒక ప్రైవేట్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ కంపెనీలో పని చేస్తున్న డింపిల్ అనే యువతిని, ఆమె సహోద్యోగి (మాజీ ప్రియుడు) హర్విందర్ మాన్ అలియాస్ హ్యారీ ఆఫీస్ లోపలే అందరూ చూస్తుండగానే కత్తితో పొడిచి కిరాతకంగా చంపేశాడు. ఆపై నిందితుడు కూడా అదే కత్తితో తన గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘోరకలికి సంబంధించిన దృశ్యాలన్నీ కార్యాలయంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి.
పోలీసుల కథనం ప్రకారం.. గురువారం రాత్రి సుమారు 7.40 గంటల సమయంలో నిందితుడు హ్యారీ ఆఫీసులోకి ప్రవేశించి, తన డెస్క్ వద్ద కూర్చుని పని చేసుకుంటున్న డింపిల్‌పై వెనుక నుంచి ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడు. ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ యువతి బయటకు పరిగెత్తేందుకు ప్రయత్నించగా, నిందితుడు ఆమెను వదలకుండా వెంటాడి, జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ వచ్చి విచక్షణారహితంగా దాడి చేశాడు. కార్యాలయంలోని తోటి ఉద్యోగులు అడ్డుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. యువతి కింద పడిపోయినప్పటికీ ఏమాత్రం ఆగకుండా 20 కంటే ఎక్కువ సార్లు కత్తితో పొడిచి హతమార్చాడు.
ఆ తర్వాత నిందితుడు హ్యారీ ఆఫీస్ లోపలి గదిలోకి వెళ్లి తన గొంతుపై బలంగా పొడుచుకుంటూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తోటి ఉద్యోగుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరినీ సమీపంలోని ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే డింపిల్ మరణించినట్లు వైద్యులు ప్రకటించగా, నిందితుడు హ్యారీ పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉంది. గత మూడేళ్లుగా ఒకే కంపెనీలో పని చేస్తూ ప్రేమలో పడ్డ వీరిద్దరూ, కొంతకాలం క్రితం విడిపోయారు. మళ్లీ సంబంధాన్ని పునరుద్ధరించుకోవడానికి హ్యారీ ప్రయత్నించగా డింపిల్ నిరాకరించిందని, ఈ క్రమంలో జరిగిన గొడవతోనే నిందితుడు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.









