కొత్త అవతారంలో అక్కినేని హీరో: ‘దూత 2’ వెబ్ సిరీస్‌తో నిర్మాతగా మారిన నాగచైతన్య!

అక్కినేని యువ హీరో నాగచైతన్య నటుడిగా మరో మెట్టు పైకెక్కడంతో పాటు, నిర్మాతగా సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘దూత’ మొదటి భాగం ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా రాబోతున్న ‘దూత 2’ సిరీస్‌కు ఆయన కథానాయకుడిగానే కాకుండా తొలిసారి నిర్మాతగా కూడా వ్యవహరించనున్నారు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ రెండో భాగం నేడు హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.

ఈ చిత్ర పూజా కార్యక్రమానికి అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా హాజరై, తొలి షాట్‌కు క్లాప్‌ కొట్టి చిత్ర యూనిట్‌కు తన ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సిరీస్‌తో తాను ప్రొడ్యూసర్‌గా మారుతున్న విషయాన్ని నాగచైతన్య సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. “దూత రెండో అధ్యాయంలోకి అడుగుపెట్టడంతో పాటు నిర్మాతగా నా తొలి అడుగు వేస్తున్నాను. ఈ శుభారంభం ఎంతో సంతోషంగా ఉంది. ఇక ముందుకు సాగడమే, అద్భుతాలు జరగబోతున్నాయి” అంటూ పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు.

గతంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అయిన ‘దూత’ మొదటి భాగంలో భవిష్యత్తులో జరగబోయే ప్రమాదాలను ముందే అంచనా వేసే రహస్యాన్ని ఛేదించే జర్నలిస్ట్ ‘సాగర్’ పాత్రలో చైతూ నటనకు విశేష స్పందన లభించింది. ఇప్పుడు శరత్ మరార్‌తో కలిసి ఈ రెండో భాగాన్ని నాగచైతన్య స్వయంగా నిర్మిస్తుండటం గమనార్హం. ఈ క్రేజీ సిరీస్‌లో చైతూ సరసన పార్వతి తిరువోతు, ప్రియా భవాని శంకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మళ్లీ అదే టీమ్‌తో కలిసి పనిచేయడం, నాగార్జున గారు వచ్చి తమలో ఉత్సాహం నింపడంపై హీరోయిన్ ప్రియా భవాని శంకర్ కూడా ఆనందం వ్యక్తం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు