మాజీ మావోయిస్టు అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ ఉద్యమ పథం నుంచి న్యాయ విద్య వైపు అడుగులు వేశారు. తెలంగాణలో తాజాగా విడుదలైన లాసెట్ (TS LAWCET) ప్రవేశ పరీక్షల ఫలితాల్లో ఆయన అద్భుత ప్రతిభ కనబరిచారు. ఐదేళ్ల న్యాయ విద్య కోర్సు కోసం రాసిన ఈ ప్రవేశ పరీక్షలో 57 మార్కులు సాధించి, రాష్ట్ర స్థాయిలో ఏకంగా 349వ ర్యాంకుతో అదరగొట్టారు. 50 ఏళ్లు పైబడిన వయసులోనూ పట్టుదలతో చదివి మంచి ర్యాంకు సాధించిన దేవ్‌జీ.. భవిష్యత్తులో లాయర్‌గా మారి సమాజంలోని నిరుపేదలకు ఉచితంగా న్యాయ సహాయం అందిస్తానని చెప్తున్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలోనే పోలీసుల ఎదుట లొంగిపోయిన దేవ్‌జీ.. 1980-82 కాలంలో కోరుట్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ (MPC) చదివారు. అయితే అప్పట్లో ఆయనకు ‘తెలుగు’ సబ్జెక్టు బ్యాక్‌లాగ్ మిగిలిపోయింది. న్యాయ విద్య అభ్యసించాలనే బలమైన కోరికతో ఆయన ఇటీవల ఇంటర్ బోర్డు నుంచి ప్రత్యేక అనుమతి పొంది, మే 13న ఇంటర్ సెకండియర్ తెలుగు పరీక్షను కూడా రాశారు. ఈ ఇంటర్ పరీక్ష ఫలితాలు త్వరలోనే విడుదల కానున్నాయి.
మరోవైపు గురువారం విడుదలైన తెలంగాణ లాసెట్ ఫలితాల్లో ఏకంగా 73 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 54,374 మంది పరీక్ష రాయగా.. 39,673 మంది కన్వీనర్ కోటా కింద సీట్లు పొందేందుకు అర్హత సాధించినట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి తెలిపారు. ఉత్తీర్ణులైన వారిలో 60 ఏళ్లు దాటిన వారు సుమారు 450 మందికి పైగా ఉండటం విశేషం. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆదేశాల ప్రకారం కోర్సుల్లో చేరిన అభ్యర్థులకు కనీసం 75 శాతం హాజరు తప్పనిసరి అని అధికారులు స్పష్టం చేశారు.









