మే 3వ తేదీన జరిగిన నీట్ యూజీ (NEET UG) పరీక్ష లీకేజీ వివాదం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జూన్ 21వ తేదీన జరగబోయే పునఃపరీక్షను కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఒక మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ ప్రశ్నాపత్రాల రవాణా కోసం భారత వాయుసేన (IAF) యుద్ధ విమానాలను రంగంలోకి దించడం విశేషం. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 18 వ్యూహాత్మక కేంద్రాలకు వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానాల ద్వారానే అత్యంత సురక్షితంగా ప్రశ్నా పత్రాలను చేరవేసేలా రక్షణ, విద్యాశాఖలు భారీ నిఘా ప్లాన్ సిద్ధం చేశాయి.
ప్రశ్నా పత్రాల రవాణా సమయంలో ఎలాంటి ట్యాంపరింగ్ లేదా లీకేజీలకు అవకాశం లేకుండా, వాటి భద్రతా గొలుసును బలోపేతం చేయడానికి ఎయిర్ ఫోర్స్ సేవలను వాడుకుంటున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. ఈ భారీ హై-సెక్యూరిటీ రీ టెస్ట్ కోసం కేవలం వాయుసేన మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా పరీక్షా కేంద్రాల వద్ద సుమారు 5 లక్షల మంది సిబ్బందిని మోహరించనున్నారు. అంతేకాకుండా, అక్రమాలను అడ్డుకునేందుకు తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత నిఘా కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు పేపర్ లీక్ రూమర్స్ వ్యాప్తి చెందకుండా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై నిరంతర నిఘా ఉంచనున్నారు.
భద్రతా చర్యల్లో భాగంగా ఈసారి ప్రశ్నా పత్రాలను రూపొందించే ప్రక్రియను అత్యంత రహస్యంగా ఉంచారు. ఇందుకోసం మూడు వారాల క్రితమే ఎంపిక చేసిన ఉపాధ్యాయులు, సబ్జెక్ట్ నిపుణులతో కూడిన ప్రత్యేక బృందాన్ని అధికారులు పూర్తిగా బాహ్య ప్రపంచంతో సంబంధం లేని ఒక రహస్య ప్రాంతంలో ఐసోలేషన్‌లో ఉంచారు. వీరికి మొబైల్ ఫోన్లు గానీ, ఇంటర్నెట్ సౌకర్యం గానీ కల్పించలేదు. జూన్ 21వ తేదీన పరీక్ష ముగిసేంత వరకు ఈ నిపుణుల బృందం పూర్తి ఐసోలేషన్‌లోనే గడపాల్సి ఉంటుంది. నీట్ పరీక్షపై విద్యార్థులు, తల్లిదండ్రులలో కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి పునరుద్ధరించడానికే కేంద్రం ఈ స్థాయి కఠిన నిర్ణయాలు తీసుకుంది.









