ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని టాలీవుడ్ నటుడు రాహుల్ రామకృష్ణ చేసిన వరుస ట్వీట్లు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపాయి. ఆర్భాటాలు పక్కన పెట్టి పంచాయతీరాజ్ నిధుల లెక్కలు చెప్పాలంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై జనసైనికులు ఇప్పటికే తీవ్రంగా మండిపడుతుండగా, తాజాగా ఈ వివాదంలోకి నటి, బీజేపీ నేత మాధవీలత ఎంట్రీ ఇచ్చారు. రాహుల్ రామకృష్ణ వైఖరిని తీవ్రంగా తప్పుపడుతూ ఆమె అత్యంత ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. కేవలం పబ్లిసిటీ కోసమే రాహుల్ ఇలాంటి ట్వీట్లు చేస్తున్నారని, వివిధ రాజకీయ పార్టీల మద్దతు కోసమే తెలంగాణవాదం పేరుతో జనాలను విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.
రాహుల్ రామకృష్ణ ధోరణి గతంలో కొందరు భారత్ నుంచి కాశ్మీర్‌ను వేరు చేయాలని చూసిన ‘ఆజాద్ కాశ్మీర్’ సిద్ధాంతంలా ఉందంటూ మాధవీలత మండిపడ్డారు. తెలంగాణ అనేది భారతదేశంలో ఒక భాగమనే విషయం మర్చిపోవద్దని, ఇక్కడ ఆంధ్రావాళ్లు, మార్వాడీలు ఉండకూడదనే భావన సరికాదని హితవు పలికారు. “నీకు అంతగా ప్రశ్నించే దమ్ము, ధైర్యం ఉంటే.. ముందు నీ సొంత రాష్ట్రమైన తెలంగాణలో అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో ఇక్కడి పంచాయతీరాజ్ మంత్రి ప్రజలకు ఏం చేశారో అడుగు, గతంలో తెలంగాణ కోసం పోరాడిన వారికి వెన్నుపోటు పొడిచిన లీడర్లను ప్రశ్నించు, అప్పుడు నువ్వు నిజాయితీపరుడివి అవుతావు” అని రాహుల్‌కు సవాల్ విసిరారు.
పవన్ కళ్యాణ్ నిస్వార్థమైన నాయకుడని, ఆయన ఆంధ్రప్రదేశ్‌కు దొరికిన ఒక ఆణిముత్యం అని మాధవీలత కొనియాడారు. పవన్ కళ్యాణ్ ఎలాంటి భూకబ్జాలు చేయరని, ఎవరి సొమ్ము తినరని, రాజ్యాంగ పరిధులు మరియు అధికారుల సహకారంతో అద్భుతంగా పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. ఆయన తన నియోజకవర్గ ప్రజలకు, ఏపీ ప్రజలకు ఏం చేస్తున్నారో అందరికీ బాగా తెలుసన్నారు. అందరికీ పవన్ కళ్యాణ్ మాత్రమే ఉద్దెరగా దొరికారని, వేరే ఏ నాయకుడినీ ప్రశ్నించే ధైర్యం ఎవరికీ లేదని ఆమె ఎద్దేవా చేశారు. పవన్‌ను అడిగే ప్రశ్నలేవో తన సొంత రాష్ట్రంలో ఉన్న మంత్రులను అడిగితే బాగుంటుందని రాహుల్ రామకృష్ణకు గట్టిగా హితవు పలికారు.









