ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ పరీక్ష, నియామకాల ప్రక్రియలో అధికార కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నియామక కుంభకోణంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)తో సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, డీఎస్సీ నియామకాలకు సంబంధించి వెలుగులోకి వస్తున్న వాస్తవాలు లక్షలాది మంది అభ్యర్థుల నమ్మకాన్ని వమ్ము చేశాయని, ప్రతిభావంతులైన నిరుద్యోగుల జీవితాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీవ్రంగా దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా డీఎస్సీ అక్రమాలపై జగన్ సవివరంగా మాట్లాడారు. ఈసారి డీఎస్సీ కన్వీనర్‌ను ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టి, ప్రశ్నపత్రం రూపకల్పన, పరీక్షల నిర్వహణ బాధ్యతలను ఎస్సీఈఆర్టీ (SCERT) డైరెక్టర్‌కు అప్పగించారని, ఒకే అధికారి చేతిలో కీలక అధికారాలు కేంద్రీకరించి పారదర్శకతను పూర్తిగా దెబ్బతీశారని ఆరోపించారు. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో భారీ అక్రమాలు జరిగాయని ధ్వజమెత్తారు. అర్హత పరీక్ష రాయకుండా, కేవలం పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఉంటే చాలనేలా జీవోలు ఇచ్చి టీడీపీ నేతలకు కావాల్సిన వారికి ఉద్యోగాలిచ్చారని, జాతీయ క్రీడల్లో బంగారు పతకాలు సాధించిన నిజమైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని విమర్శించారు. మొత్తం 270 మంది పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందారని జగన్ స్పష్టం చేశారు.
ప్రభుత్వం చేస్తున్న ఈ అక్రమాలను యువత (Gen Z) గమనిస్తోందని, తప్పులు ఒప్పుకోకుండా ఇబ్బంది పెడితే తిరగబడతారని జగన్ హెచ్చరించారు. నీట్ పేపర్ లీక్ తర్వాత ఆన్లైన్లో మొదలైన ‘జనతా కాక్రోచ్ పార్టీ’ ఉద్యమాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. డీఎస్సీ వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌లే ప్రధాన ముద్దాయిలని, కాబట్టి వారి పరిధిలోని విచారణతో బాధితులకు న్యాయం జరగదని, అందుకే సీబీఐ విచారణే శరణ్యమని స్పష్టం చేశారు. జూన్ 12న తలపెట్టిన ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన కార్యక్రమంలో ఈ డీఎస్సీ అక్రమాల అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించాలని ఆయన వైఎస్సార్సీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.









