తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ‘పవర్ స్టార్’ గా, రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఒక ఆసక్తికరమైన రహస్యాన్ని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో స్వయంగా పంచుకున్నారు. తన అసలు పేరు పవన్ కల్యాణ్ కాదని, ఆ పేరు తనకు ఎలా వచ్చిందో ఆయన వివరించారు. ఈ వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ.. తాను పుట్టినప్పుడు ఇంట్లో పెట్టిన అసలు పేరు ‘శ్రీ కల్యాణ్ కుమార్’ అని పవన్ కల్యాణ్ వెల్లడించారు. అయితే ఆ తర్వాత స్కూల్ రికార్డుల్లో చేర్చే సమయానికి కొన్ని కారణాల వల్ల ‘శ్రీ’ అనే పదాన్ని తొలగించి, కేవలం ‘కె. కల్యాణ్ కుమార్’ అని రిజిస్టర్ చేశారని తెలిపారు. గతంలో ఆయన తల్లి అంజనా దేవి కూడా ఒక ఇంటర్వ్యూలో తన కొడుకు అసలు పేరు కల్యాణ్ కుమార్ అని పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకోవచ్చు.
మరి కల్యాణ్ కుమార్ కాస్తా ‘పవన్ కల్యాణ్’ గా ఎలా మారారనే దానికి ఆయన ఒక ఆసక్తికరమైన ఫ్లాష్‌బ్యాక్ చెప్పారు. తనకు చిన్నప్పటి నుండి మార్షల్ ఆర్ట్స్ (యుద్ధ విద్యలు) అంటే విపరీతమైన ఆసక్తి ఉండేదని, ట్రైనింగ్ తీసుకునే రోజుల్లో తన ఛాతీపై వందల కిలోల బండరాళ్లను పెట్టుకుని సుత్తితో పగలగొట్టించేంత కఠినమైన విన్యాసాలు చేసేవాడినని తెలిపారు. ఆయన శారీరక దృఢత్వాన్ని, అంకితభావాన్ని చూసి మెచ్చిన మార్షల్ ఆర్ట్స్ గురువు.. ఆయన పేరుకు ముందు ‘పవన్’ అనే పదాన్ని చేర్చారని, దాన్నే ఆయన తన స్క్రీన్ నేమ్‌గా మార్చుకున్నారని వివరించారు. అలా గురువు ఇచ్చిన పేరు కాలక్రమేణా టాలీవుడ్లోనే కాకుండా రాజకీయాల్లోనూ ఒక బ్రాండ్‌గా మారిపోయింది.









