‘పోలీస్ కంప్లైంట్’ వివాదం: దర్శకుడి ఆరోపణలపై నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఘాటు స్పందన

తన తాజా చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’ ప్రమోషన్లకు, డబ్బింగ్‌కు సహకరించడం లేదంటూ దర్శకుడు సంజీవ్ మేగోటి చేసిన ఆరోపణలపై ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ఈ వివాదాన్ని మరింత పెద్దది చేయడం తనకు ఇష్టం లేదని చెప్తూనే, సినిమా కోసం తాను ఎల్లప్పుడూ చిత్ర బృందానికి సహకరించానని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక ప్రత్యేకమైన పోస్ట్ పెడుతూ.. ఇండస్ట్రీలో తాను ఎవరి ఆరోపణల గురించి బహిరంగంగా చర్చించాలని అనుకోవడం లేదని, తన పని తాను చూసుకుంటూ వెళ్లిపోతానని తేల్చిచెప్పారు.

వరలక్ష్మి, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన ‘పోలీస్ కంప్లైంట్’ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో, ఇటీవల జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు సంజీవ్ మేగోటి సంచలన వ్యాఖ్యలు చేశారు. వరలక్ష్మి రెమ్యూనరేషన్ మొత్తం తీసుకుని కూడా పబ్లిసిటీ ఈవెంట్లకు రావడం లేదని, ప్రమోషన్స్ కోసం అడుక్కున్నా టైమ్ లేదని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చిందని ఆరోపించారు. అంతేకాకుండా, మూడు నెలల పాటు డబ్బింగ్ చెప్పకుండా తమను తీవ్రంగా ఇబ్బంది పెట్టిందని, ఆ సమయంలోనే ఆమె సొంత దర్శకత్వంలో ‘సరస్వతి’ అనే సినిమాను పూర్తి చేసుకుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలే తమ సినిమాలను ప్రమోట్ చేసుకుంటుంటే ఆమెకు ఎందుకంత అహంకారమని ప్రశ్నించారు.

దర్శకుడి విమర్శలపై వరలక్ష్మి తన పోస్ట్‌లో గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. “చిత్ర బృందానికి అవసరమైనప్పుడల్లా నేను అందుబాటులోనే ఉన్నాను, వీలైనన్ని ఈవెంట్లకు హాజరయ్యాను. ఇటీవలి వేడుకలో దర్శకుడు నాపై ఏం మాట్లాడారో నాకు పూర్తిగా తెలియదు. కొన్ని విషయాల్లో నాకంటూ సొంత అభిప్రాయాలు ఉంటాయి” అని పేర్కొన్నారు. అంతేకాకుండా ‘అరిచే కుక్కలు కరవడం చాలా అరుదు.. నేను అరవను, అవసరమైతే కరుస్తా’ అంటూ ఒక పవర్‌ఫుల్ కొటేషన్‌ను షేర్ చేస్తూ, తానేమీ అందరిలా చౌకబారు ఆరోపణలు చేయనని ఇన్ డైరెక్ట్‌గా సెటైర్లు వేశారు. ఈ వివరణతో దర్శకుడి ఆరోపణలకు చెక్ పెట్టే ప్రయత్నం చేసిన వరలక్ష్మి వ్యాఖ్యలపై ‘పోలీస్ కంప్లైంట్’ మేకర్స్ ఇకపై ఎలా స్పందిస్తారో చూడాలి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు