లక్నో చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దేశ రాజధాని ఢిల్లీకి బయల్దేరాల్సిన ఇండిగో విమానానికి టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే బాంబు బెదిరింపు రావడంతో విమానాశ్రయంలో తీవ్ర కలకలం రేగింది. 6E2111 నంబర్ గల ఇండిగో విమానం ఉదయం 10:45 గంటలకు రన్‌వేపైకి వెళ్లాల్సి ఉండగా, విమానంలోని టాయిలెట్ టిష్యూ పేపర్‌పై చేతితో రాసిన ఒక అనుమానాస్పద నోట్ లభ్యమైంది. ఆ నోట్లో విమానంలో బాంబు ఉన్నట్లు రాసి ఉండటాన్ని గమనించిన క్యాబిన్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై విమానాశ్రయ భద్రతా అధికారులకు మరియు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) కు సమాచారం అందించారు.
బాంబు హెచ్చరిక నోట్ దొరికిన వెంటనే అత్యవసర ప్రోటోకాల్‌ను అమలు చేసిన విమానాశ్రయ అధికారులు.. విమానంలో ఉన్న సుమారు 180 మంది ప్రయాణికులను తక్షణమే కిందకు దించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అనంతరం విమానాన్ని ప్రత్యేక ఐసోలేషన్ బేకు తరలించి బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ మరియు కేంద్ర భద్రతా బలగాలు క్షుణ్నంగా తనిఖీలు చేపట్టాయి. విమానంలోని ప్రతి మూలను, ప్రయాణికుల లగేజీని పూర్తిగా సోదాలు చేసినప్పటికీ ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేదా పేలుడు పదార్థాలు లభించలేదు. దీంతో ఆ బాంబు బెదిరింపు పూర్తిగా తప్పుడు సమాచారమని (ఫేక్ కాల్) అధికారులు నిర్థారించడంతో విమానయాన సంస్థ మరియు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
అయితే, ఈ ఘటనకు కొద్దిగా ముందే కేరళలోని కన్నూర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో కూడా ఇలాంటి కలకలమే రేగింది. ముంబై – కన్నూర్ ఇండిగో విమానం ల్యాండ్ అయిన తర్వాత టాయిలెట్‌లోని డస్ట్‌బిన్‌లో ఒక నోట్ లభించగా, సిబ్బంది దాన్ని బాంబు బెదిరింపుగా భావించి ఐసోలేషన్ బేలో తనిఖీలు చేయించారు. అయితే ఆ నోట్లో ఎలాంటి బెదిరింపు లేదని, సిబ్బంది తప్పుగా అర్థం చేసుకున్నారని పోలీసులు తేల్చారు. ఇటీవల దేశంలో విమానాలకు వరుసగా బాంబు బెదిరింపులు వస్తుండటంతో భద్రతా సంస్థలు మరింత అప్రమత్తమయ్యాయి. లక్నో ఘటనలో టిష్యూ పేపర్‌పై ఆ ఆగంతక నోట్ రాసి, ప్రయాణికులను ఆందోళనకు గురిచేసిన వ్యక్తిని గుర్తించేందుకు విమానశ్రయంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను, ప్రయాణికుల వివరాలను పోలీసులు నిశితంగా పరిశీలిస్తూ దర్యాప్తు జరుపుతున్నారు.








