మ్యాగీలో పురుగులు? సోషల్ మీడియా పోస్ట్‌పై స్పందించిన నెస్లే ఇండియా….

ప్రముఖ బ్రాండ్ మ్యాగీ నూడుల్స్‌లో పురుగులు ఉన్నాయంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న విమర్శలపై మాతృ సంస్థ ‘నెస్లే ఇండియా’ ఘాటుగా స్పందించింది. ఇంటర్నెట్‌లో వస్తున్న వార్తలన్నీ పూర్తిగా నిరాధారమైన ఆరోపణలని సంస్థ స్పష్టం చేసింది. మ్యాగీ ప్యాకెట్‌లో పురుగులు కనిపించాయని ఓ నెటిజన్ చేసిన పోస్ట్ వైరల్ కావడంతో, దేశవ్యాప్తంగా ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఈ వివాదం ముదరడంతో భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (FSSAI) కూడా ఈ ఫిర్యాదుపై తక్షణమే స్పందించి, పూర్తి వివరణ ఇవ్వాలంటూ నెస్లే సంస్థను కోరింది.

మ్యాగీ నూడుల్స్‌పై వచ్చిన ఈ ఆరోపణలు ఒక ధ్రువీకరించని సోషల్ మీడియా ఖాతా నుంచి వచ్చాయని నెస్లే ఇండియా తెలిపింది. ఆరోపణలు వచ్చిన వెంటనే తాము సదరు వినియోగదారుడిని సంప్రదించామని పేర్కొంది. పురుగులు ఉన్నాయంటున్న ఆ నిర్దిష్ట ఉత్పత్తి నమూనాను (సాంపిల్) పరీక్షల నిమిత్తం తమకు పంపించాలని పలుమార్లు కోరినా, ఫిర్యాదు చేసిన వ్యక్తి నుంచి ఎలాంటి స్పందనా రాలేదని కంపెనీ వెల్లడించింది. దీనివల్ల అసలు ఉత్పత్తి నమూనాను పరిశీలించే అవకాశం తమకు లభించలేదని, అయినప్పటికీ వినియోగదారుల నమ్మకాన్ని కాపాడటం కోసం తాము అంతర్గతంగా పూర్తి పరీక్షలు నిర్వహించామని నెస్లే పేర్కొంది.

ఈ వివాదానికి ముగింపు పలికేందుకు, ఆరోపణలు వచ్చిన బ్యాచ్‌కు సంబంధించిన రిఫరెన్స్ నమూనాలను నెస్లే సంస్థ ‘నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్’ (NABL) కు పంపించింది. ఈ ప్రభుత్వ గుర్తింపు పొందిన ల్యాబ్ పరీక్షల్లో మ్యాగీ నూడుల్స్‌లో ఎలాంటి పురుగులు లేదా ఇతర కలుషిత పదార్థాల ఆనవాళ్లు కనిపించలేదని తేలింది. ఉత్పత్తి నాణ్యతా ప్రమాణాలకు పూర్తి అనుగుణంగా ఉందని ల్యాబ్ రిపోర్ట్ వచ్చినట్టు కంపెనీ ప్రకటించింది. తమ ఉత్పత్తులు అత్యున్నత నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని, వినియోగదారుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడబోమని నెస్లే ఇండియా స్పష్టం చేసింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు