అన్ని ప్రాంతాలకూ అభివృద్ధి.. హెల్త్‌కేర్‌లో ప్రెడిక్టివ్ విధానం: మంత్రి సత్యకుమార్

ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి, అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. తిరుపతి సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సైతం ఇదే విషయాన్ని ప్రజలకు వివరించారని ఆయన గుర్తుచేశారు. ప్రతి ఒక్కరికీ నాణ్యమైన, ఉచిత వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని చెబుతూ.. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగి వివరాలను, వారి వైద్య చరిత్రను పూర్తి స్థాయిలో డిజిటలైజ్ చేసినట్లు మంత్రి వెల్లడించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో సాంప్రదాయ వైద్య విధానాల నుండి ‘ప్రెడిక్టివ్ హెల్త్‌కేర్’ విధానంలోకి అడుగుపెట్టామని మంత్రి చెప్పారు. వ్యాధి వచ్చాక వైద్యం చేయడం కంటే, అది రాకముందే గుర్తించేలా వ్యవస్థను మార్చామని ఆయన వివరించారు. ఇందులో భాగంగా ప్రజల వద్దకే నేరుగా వెళ్లి 45 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నామని, దీనివల్ల వ్యాధులను ముందే గుర్తించి అవసరమైన మందులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అలాగే టెలిమెడిసిన్ ద్వారా రోగుల సందేహాలకు నిపుణులైన వైద్యులతో సమాధానాలు ఇప్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుతున్న మెరుగైన సేవల వల్ల ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో నమ్మకం, సంస్కృతి, సంతృప్తి పెరిగాయని.. అందుకే ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా పెరిగిందని సత్యకుమార్ అన్నారు. తమ ప్రభుత్వ పనితీరుకు ఆసుపత్రుల్లోని గణాంకాలే నిదర్శనమని చెప్పారు. ‘స్వర్ణాంధ్ర-2047’ లక్ష్య సాధనలో ‘ఆరోగ్యాంధ్రప్రదేశ్’ అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని చెబుతూ.. ఈ విప్లవాత్మక మార్పునకు సహకరించిన వైద్య సిబ్బందికి, అధికారులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు