హైదరాబాద్‌లో ఆర్టీసీ డ్రైవర్‌కు చుక్కలు చూపించిన బైకర్.. వీడియో వైరల్!

హైదరాబాద్ నగరంలో ఓ ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యానికి, ఒక సామాన్య బైకర్ చూపిన ధైర్యానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ట్రాఫిక్ నిబంధనలను పూర్తిగా బేఖాతరు చేస్తూ రద్దీగా ఉండే రోడ్డుపై రాంగ్ రూట్‌లో బస్సును నడిపిన డ్రైవర్‌కు ఆ బైకర్ అడ్డుగా నిలిచాడు. డ్రైవర్ ఎంత భయపెట్టాలని చూసినా వెనకడుగు వేయకుండా, చివరికి ఆ భారీ బస్సును వెనక్కి తిప్పేలా చేసి సోషల్ మీడియాలో హీరోగా నిలిచాడు.

వివరాల్లోకి వెళితే.. నగరంలోని ఒక రద్దీ ప్రాంతంలో ఆర్టీసీ డ్రైవర్ వన్-వే నిబంధనను ఉల్లంఘించి, ట్రాఫిక్‌కు ఎదురుగా రాంగ్ రూట్‌లో వేగంగా బస్సును నడుపుకుంటూ వచ్చాడు. బస్సు వేగాన్ని చూసి ఇతర వాహనదారులు పక్కకు తప్పుకున్నా, అటుగా వస్తున్న ఒక యువకుడు మాత్రం ఏమాత్రం భయపడకుండా తన బైక్‌ను బస్సుకు సరిగ్గా ఎదురుగా ఆపేశాడు. దీంతో ఆగ్రహానికి గురైన డ్రైవర్ బస్సును పక్కకు తిప్పి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆ బైకర్ పట్టువదలకుండా బస్సు వెళ్లే మార్గానికి మళ్లీ అడ్డంగా నిలబడ్డాడు.

నడిరోడ్డుపై జరిగిన ఈ హైడ్రామాను చూసి అక్కడున్న ఇతర వాహనదారులు కూడా ఆ యువకుడికి మద్దతుగా నిలిచారు. చుట్టూ జనం చేరడం, బైకర్ ఎంతకీ తగ్గకపోవడంతో చేసేదేమీ లేక ఆర్టీసీ డ్రైవర్ బస్సును నెమ్మదిగా వెనక్కి తిప్పక తప్పలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పడేసిన ఆర్టీసీ డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు టీజీఎస్‌ఆర్‌టీసీ (TGSRTC) యాజమాన్యాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు