గ్లోబల్ టెక్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం నడుస్తున్న వేళ.. సిలికాన్ వ్యాలీలో ఓ భారత సంతతి మహిళ ఎవరూ ఊహించని చరిత్రను సృష్టించారు. ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ సంస్థ అరిస్టా నెట్వర్క్స్ ప్రెసిడెంట్, సీఈఓ అయిన జయశ్రీ ఉల్లాల్, 2026 సంవత్సరానికి గాను ఫోర్బ్స్ ప్రకటించిన ‘అమెరికాస్ రిచెస్ట్ సెల్ఫ్ మేడ్ విమెన్’ (సొంతంగా ఎదిగిన అత్యంత సంపన్న మహిళలు) తాజా జాబితాలో టాప్-10లో నిలిచి సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఈ ప్రతిష్టాత్మక లిస్ట్‌లో నిలిచిన ఏకైక భారత సంతతి మహిళ జయశ్రీ కావడం విశేషం. ఫోర్బ్స్ తాజా వివరాల ప్రకారం.. ఆమె నికర ఆస్తి విలువ ఏకంగా 6.8 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 56,700 కోట్లకు పైగా)గా నమోదైంది. ఈ భారీ సంపదతో ఆమె ఈ వార్షిక జాబితాలో ఏడో స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
జయశ్రీ ఉల్లాల్ లండన్‌లో జన్మించినప్పటికీ, ఆమె బాల్యమంతా దేశ రాజధాని న్యూఢిల్లీలోనే గడిచింది. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన ఆమె, శాన్ ఫ్రాన్సిస్కో స్టేట్ యూనివర్శిటీ నుండి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ, శాంటా క్లారా యూనివర్శిటీ నుండి ఇంజినీరింగ్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ పట్టా పొందారు. అరిస్టా నెట్వర్క్స్ బాధ్యతలు చేపట్టడానికి ముందు జయశ్రీ.. సిలికాన్ వ్యాలీలోని ఏఎండీ, ఫెయిర్‌చైల్డ్ సెమీకండక్టర్స్ వంటి కంపెనీల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత నెట్వర్కింగ్ దిగ్గజం ‘సిస్కో సిస్టమ్స్’లో చేరి దాదాపు 15 ఏళ్ల పాటు సుదీర్ఘ సేవలు అందించడమే కాకుండా, ఆ సంస్థ వ్యాపార విస్తరణలో అత్యంత కీలక పాత్ర పోషించారు.
అయితే, 2008లో ఆమె తన కెరీర్లో అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. అప్పటికే స్థిరపడిన సిస్కో లాంటి దిగ్గజ సంస్థను వదిలిపెట్టి.. కేవలం 50 మంది కంటే తక్కువ ఉద్యోగులు ఉండి, ఎలాంటి ఆదాయం లేని ‘అరిస్టా నెట్వర్క్స్’ అనే చిన్న స్టార్టప్ కంపెనీకి సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. భవిష్యత్తు అంతా క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సెంటర్లదేనని ఆమె బలంగా నమ్మారు. జయశ్రీ వ్యూహాత్మక నాయకత్వంలో అరిస్టా నెట్వర్క్స్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో తిరుగులేని శక్తిగా ఎదిగింది. 2014లో ఐపీఓకు వెళ్లిన ఈ కంపెనీ, 2024 నాటికి ఏకంగా 9 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 75,000 కోట్లు) వార్షిక ఆదాయాన్ని ఆర్జించే స్థాయికి చేరింది. ప్రస్తుతం అరిస్టా సంస్థలో జయశ్రీకి 3 శాతం వాటా ఉండగా, ఆమె ప్రముఖ క్లౌడ్ కంపెనీ ‘స్నోఫ్లేక్’ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లోనూ సేవలు అందిస్తున్నారు.









