ఆన్లైన్ ప్రపంచంలో పెరుగుతున్న ప్రమాదాల నుండి చిన్నారులను రక్షించేందుకు బ్రిటన్ (UK) ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు వయసున్న పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించకుండా పూర్తిగా నిషేధిస్తున్నట్లు ఆ దేశ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ అధికారికంగా ప్రకటించారు. డిజిటల్ యుగంలో పిల్లల మానసిక ఆరోగ్యాన్ని కాపాడటం, వారి భద్రతను పటిష్టం చేయడంతో పాటు వారికి ఆహ్లాదకరమైన బాల్యాన్ని తిరిగి అందించడమే ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.
ఈ నూతన చట్టం ప్రకారం ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టిక్‌టాక్, యూట్యూబ్, స్నాప్‌చాట్, ఎక్స్ (ట్విట్టర్) వంటి ప్రధాన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో 16 ఏళ్లలోపు వారికి అకౌంట్లు తెరిచే అవకాశం ఉండదు. ఇప్పటికే ఆస్ట్రేలియా విజయవంతంగా అమలు చేస్తున్న విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని బ్రిటన్ ఈ సరికొత్త పాలసీని రూపొందించింది. వీటితో పాటు లైవ్ స్ట్రీమింగ్స్ చూడటం, గేమింగ్ సైట్స్‌లో అపరిచితులతో చాటింగ్ చేయడం వంటి ఫీచర్లపై కూడా కఠినమైన ఆంక్షలు ఉంటాయి. ప్రభుత్వం జరిపిన సర్వేలో దాదాపు 90 శాతం మంది తల్లిదండ్రులు ఈ నిర్ణయానికి పూర్తి మద్దతు పలకడం విశేషం.
అయితే, ఈ చట్టాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయడంపై సాంకేతిక నిపుణులు కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. చాలామంది టీనేజర్లు వీపీఎన్ (VPN) మరియు ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సోషల్ మీడియాను వాడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ సవాళ్లను అంగీకరించిన ప్రధాని కీర్ స్టార్మర్.. కేవలం సాంకేతిక అడ్డంకులను సాకుగా చూపి పిల్లల భవిష్యత్తును ప్రమాదంలో పడేయలేమని తేల్చి చెప్పారు. అత్యంత కఠినమైన ‘ఏజ్ వెరిఫికేషన్’ (వయసు ధ్రువీకరణ) వ్యవస్థలను ఏర్పాటు చేసి, త్వరలోనే ఈ చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయించింది.









