తమిళనాడులో అవినీతిరహిత పాలన అందిస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మాటలను స్ఫూర్తిగా తీసుకుని, చెన్నైకి చెందిన ఒక యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవినీతిపై వినూత్నంగా యుద్ధం ప్రకటిం చారు. దీపక్ శివకుమార్ అనే ఈ యువకుడు ప్రభుత్వ విభాగాల్లో జరుగుతున్న లంచాల గుట్టును బట్టబయలు చేయడానికి ‘మక్కళ్ సాట్చి’ పేరుతో మే 27న ఒక ప్రత్యేక ఆన్‌లైన్ వేదికను (వెబ్‌సైట్) ప్రారంభించారు. ఎవరైనా లంచం అడిగితే బాధితులు ఈ వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేసేలా, వారి వ్యక్తిగత గోప్యత దెబ్బతినకుండా పేరు వెల్లడించాల్సిన అవసరం లేని విధంగా దీనిని రూపొందించడంతో సామాజిక మాధ్యమాల్లో దీనికి అనూహ్య స్పందన లభిస్తోంది.
ఈ వెబ్‌సైట్‌లో దాదాపు 75 ప్రభుత్వ విభాగాలను కేటగిరీలుగా విభజించి, ఏ డిపార్ట్‌మెంట్‌లో అవినీతి జరుగుతోంది, ఏ పనికి ఎంత డబ్బు డిమాండ్ చేస్తున్నారు వంటి వివరాలను ఆధారాలతో సహా పొందుపరిచే అవకాశం కల్పించారు. కేవలం 18 రోజుల్లోనే ఈ పోర్టల్‌కు దాదాపు 350 వరకు ఫిర్యాదులు రాగా, అందులో లంచం రూపంలో డిమాండ్ చేసిన అత్యధిక మొత్తం రూ.కోటి కాగా, అత్యల్పం రూ.10గా నమోదు కావడం గమనార్హం. వచ్చిన ఫిర్యాదుల విశ్లేషణ ప్రకారం లంచగొండితనంలో విద్యుత్తు, రెవెన్యూ శాఖలు ముందు వరుసలో ఉండగా.. కొత్త కనెక్షన్లు, మీటర్ల మార్పిడి, భూపట్టా రిజిస్ట్రేషన్‌లు, వీఆర్వో, వీఏవో పనుల కోసం భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు తేలింది. ఆ తర్వాతి స్థానాల్లో టాస్మాక్ (ఎక్సైజ్), రిజిస్ట్రేషన్, మున్సిపాలిటీ, పోలీస్, రవాణా శాఖలు ఉండగా, ఎక్కువ ఫిర్యాదులు చెన్నై, చెంగల్పట్టు, తిరువళ్లూరు జిల్లాల నుంచే వస్తున్నాయి.
ఈ వెబ్‌సైట్ ద్వారా అందుతున్న ఫిర్యాదుల లింకులు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండటంతో ప్రభుత్వ యంత్రాంగం కూడా తక్షణమే స్పందించి 24 గంటల్లోనే చర్యలు తీసుకుంటోంది. ఉదాహరణకు, చెన్నైకి చెందిన ఒక బాధితుడు తన డబ్బు రికవరీ కోసం పోలీసులు లంచం అడిగారని జూన్ 6న చేసిన ఫిర్యాదు వైరల్ కావడంతో, పోలీస్ శాఖ సదరు అధికారిపై చర్యలు తీసుకోవడమే కాకుండా బాధితుడి సొమ్మును కూడా రికవరీ చేసి అప్పగించింది. అలాగే తిరువణ్ణామలై దేవాలయాల విద్యుత్ పనులు, తూత్తుకూడిలో కమర్షియల్ కనెక్షన్ల కోసం అధికారులు డిమాండ్ చేసిన లంచాల వివరాలు కూడా ఈ వేదిక ద్వారా బయటికొచ్చి అవినీతిపరుల ఆటకట్టిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు దీనిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీతో అనుసంధానం చేయనున్నట్లు నిర్వాహకుడు దీపక్ శివకుమార్ వెల్లడించారు.









