డ్రోగో ఏరోస్పేస్ రికార్డు: భారత సైన్యానికి 41 అత్యాధునిక ‘జేకే 250ఈ’ డ్రోన్ల పంపిణీ

భారత రక్షణ రంగాన్ని స్వదేశీ సాంకేతికతతో బలోపేతం చేసే దిశగా ‘మేక్ ఇన్ ఇండియా’ వేదికగా హైదరాబాద్‌కు చెందిన డ్రోగో ఏరోస్పేస్ (Drogo Aerospace) సంస్థ చారిత్రాత్మక రికార్డు సృష్టించింది. భారత సైన్యంతో కుదుర్చుకున్న రూ. 72 కోట్ల భారీ కాంట్రాక్ట్‌లో భాగంగా, మొదటి విడత కింద 41 అత్యాధునిక ‘జేకే 250ఈ’ (JK 250E) డ్రోన్లను ఇండియన్ ఆర్మీకి విజయవంతంగా అందజేసింది. నాసిక్‌లోని సథరన్ కమాండ్ అధికారులకు ఈ తొలి బ్యాచ్‌ను అప్పగించిన సంస్థ.. మిగిలిన డ్రోన్లను రాబోయే ఆగస్టు నాటికి సరఫరా చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మైలురాయి దేశీయ రక్షణ తయారీ రంగంలో ఒక సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది.

హైదరాబాద్‌లోని మాదాపూర్ కేంద్రంగా ప్రస్థానం ప్రారంభించిన ‘డ్రోగో డ్రోన్స్’ సంస్థ, తన పరిధిని మరింత విస్తృతం చేస్తూ ఇటీవలే ‘డ్రోగో ఏరోస్పేస్’గా పేరు మార్చుకుంది. కేవలం డ్రోన్ల తయారీకే పరిమితం కాకుండా.. విమానాలు, ఉపగ్రహాలు, అంతరిక్ష నౌకల రూపకల్పన, అత్యాధునిక నిర్వహణతో కూడిన పూర్తిస్థాయి పారిశ్రామిక, పరిశోధనా కేంద్రంగా ఇది అవతరించింది. సరిహద్దుల రక్షణ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ సరికొత్త డ్రోన్లు ఒకసారి ఛార్జ్ చేస్తే 3 గంటల పాటు నిరంతరాయంగా గాల్లో ఎగురుతూ నిఘా ఉంచగలవు. శత్రువుల కదలికలను కనిపెట్టడానికి మరియు వ్యూహాత్మక సైనిక అవసరాలకు ఇవి అద్భుతంగా పనిచేస్తాయని రక్షణ నిపుణులు కొనియాడారు.

ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తి జిల్లాలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటవుతున్న ‘రక్షణ ఉత్పత్తుల కేంద్రం, డ్రోన్ సిటీ’ శంఖుస్థాపన వేడుకలో డ్రోగో ఏరోస్పేస్ తమ ఉత్పత్తులను ప్రదర్శించింది. ఈ ప్రదర్శనను వీక్షించిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంస్థ ప్రతిభను ప్రత్యేకంగా అభినందించారు. కాగా, సంస్థ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (EMC) లో 5.5 ఎకరాల భూమిని కేటాయించింది. ఇక్కడ లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక డ్రోన్ తయారీ కేంద్రాన్ని నిర్మిస్తున్నామని, ఈ నూతన ప్లాంట్ అందుబాటులోకి వస్తే మరో 500 మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని సంస్థ వ్యవస్థాపకుడు & సీఈఓ యశ్వంత్ బొంతు వెల్లడించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు